ఎయిర్ ఇండియా వీఆర్ఎస్ పథకం గడువు పొడిగింపు!
టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఉద్యోగులకు ఇచ్చిన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) దరఖాస్తు తేదీని పొడిగించింది.
న్యూఢిల్లీ: టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఉద్యోగులకు ఇచ్చిన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) దరఖాస్తు తేదీని పొడిగించింది. మే 31వ తేదీ వరకు ఉద్యోగులు వీఆర్ఎస్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం ప్రకటనలో తెలిపింది. అర్హులైన ఉద్యోగులందరూ మే 31 వరకు వీఆర్ఎస్ పథకాన్ని ఎంచుకోవచ్చని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
ఇది వరకు ఏప్రిల్ 30 వరకు ఎయిర్ ఇండియా వీఆర్ఎస్ అవకాశం కల్పించింది. 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 40 ఏళ్లు దాటిన పర్మినెంట్ జనరల్ కేడర్‌కు చెందిన ఉద్యోగులతో పాటు క్లరికల్, నైపుణ్యం లేని విభాగాలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ఎయిరిండియా ఇదివరకు ఇచ్చిన ఇంటర్నల్ మెమోలో తెలియజేసింది.
గతేడాది ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్, సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. పాత తరానికి చెందిన ఉద్యోగులకు వీఆర్‌ఎస్ కల్పిస్తూ, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గతేడాది జూన్‌లో తొలి విడత వీఆర్‌ఎస్ పథకాన్ని ప్రకటించింది.