స్వతంత్ర ఆడిట్ కోసం గ్రాంట్ థార్టన్‌ను నియమించిన అదానీ గ్రూప్!
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా భారీ నష్టాలను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ నివారణ చర్యలకు సిద్ధమవుతోంది.
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా భారీ నష్టాలను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ నివారణ చర్యలకు సిద్ధమవుతోంది. పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపడంతో పాటు నియంత్రణ సంస్థలకు సమాధానం చెప్పేందుకు, సవాళ్ల నుంచి బయటపడేందుకు గ్రూపులోని పలు కంపెనీల స్వతంత్ర ఆడిట్ కోసం ప్రముఖ అకౌంటింగ్ కంపెనీ గ్రాంట్ థార్టన్‌ను నియమించింది.
తమ కంపెనీలు ఎలాంటి విషయాలను దాచలేదని, ఆర్‌బీఐతో పాటు నియంత్రణ సంస్థల ముందు ఉంచేందుకే ఆడిట్ నిర్వహించనున్నామని, అవసరమైన నిబంధనలు పాటించినట్టు ఋజువు చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు కంపెనీ వర్గాలు వివరించాయి. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ ఆరోపించిన రుణాలు, నిధుల దుర్వినియోగం, అకౌంటింగ్ మోసాలు, దేశీయ నిధుల మళ్లింపు వంటి అంశాలపైనే ఆడిట్ దృష్టి ఉంటుందని తెలిపాయి.
ఆడిటింగ్ అకౌంట్ పటిష్టంగా ఉందని, కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టుల అమలులో జాప్యం ఉండదనే విషయాలపై ఆడిట్ రూపంలో స్పష్టత ఇవ్వాలని అదానీ గ్రూప్ భావిస్తోంది. అంతకుముందు ప్రకటనలో అదానీ సంస్థ వ్యాపార ప్రణాళికలకు సంబంధించి నిధులు ఉన్నాయని, వాటాదారులకు మెరుగైన ఫలాలను ఇవ్వగలమని ప్రకటించింది. కాగా, హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా అదానీ గ్రూపునకు చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సగానికి పైగా క్షీణించిన సంగతి తెలిసిందే.