డ్రైవర్ అవసరం లేకుండా బ్యాలెన్స్‌తో నడిచే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్(వీడియో)
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా త్వరలో దేశంలోనే అధునాతన సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురాబోతుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా త్వరలో దేశంలోనే అధునాతన సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురాబోతుంది. దానికి సోలో అని పేరు కూడా పెట్టింది. డ్రైవర్ అవసరం లేకుండా పూర్తి బ్యాలెన్స్‌తో ఈ స్కూటర్ ప్రయాణిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ CEO, భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో కనిపిస్తున్నట్లుగా స్కూటర్‌ను ఎవరు డ్రైవింగ్ చేయకుండానే, ముందు ఉన్న అడ్డంకులను దాటుకుంటూ దానికదే అటూ ఇటూ పడిపోకుండా బ్యాలెన్స్‌తో ప్రయాణించింది.
అయితే ఈ వీడియోను ఏప్రిల్ 1న పోస్ట్ చేయగా చాలా మంది నెటిజన్లు ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ప్రాంక్‌గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత భవిష్ అగర్వాల్ దీనిపై స్పష్టతనిచ్చారు. ఈ స్కూటర్ ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికి దీనిపై తమ ఇంజనీరింగ్ బృందాలు పరీక్షలు చేస్తున్నాయని, త్వరలో ఈ అధునాతన సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇది గనక మార్కెట్లోకి వస్తే భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అవుతుందని, దీంతో ఓలా రేంజ్ పెరిగిపోతుందని పలువురు నెటిజన్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.