5జీ సేవలకు కంపెనీలు సిద్ధం కావాలన్న ప్రభుత్వం!
న్యూఢిల్లీ: దేశంలో 5జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధం కావాలని సూచిస్తూ టెలికాం కంపెనీలకు ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశంలో 5జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధం కావాలని సూచిస్తూ టెలికాం కంపెనీలకు ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను జారీ చేసింది. ఇటీవల భారత అతిపెద్ద టెలికాం స్పెక్ట్రమ్ వేలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా 5జీ నెట్‌వర్క్ కోసం కేంద్రం స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లేఖను విడుదల చేసినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా 5జీ సేవల ప్రారంభానికి సిద్ధం కావాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం అభ్యర్థించినట్టు ఆయన పేర్కొన్నారు.
బుధవారం భారతీ ఎయిర్‌టెల్ టెలికాం శాఖకు 5జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించి రూ.8,312.4 కోట్ల విలువైన చెల్లింపులను ముందస్తుగా చెల్లించింది. దీని తర్వాత కొన్ని గంటల్లోనే టెలికాం విభాగం నుంచి 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖ అందినట్లు భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ప్రకటించారు. చెల్లింపులు చేసిన తక్కువ సమయంలోనే కేటాయింపుల లేఖను అందుకోవడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్స్‌లు టెలికాం విభాగానికి రూ.17,876 కోట్ల ముందస్తు చెల్లింపులు చేశాయి. ఇందులో జియో రూ. 7,864.78 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 1,679.98 కోట్లు, అదానీ డేటా నెట్‌వర్క్స్ రూ. 18.94 కోట్లను చెల్లించాయి. కేంద్రం నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్‌లో ఈ కంపెనీలు మొత్తం రూ. 1.5 లక్షల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. ఈ చెల్లింపులను కంపెనీలు 20 వార్షిక వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. ఇందులో ఎయిర్‌టెల్ మాత్రమే 4 వాయిదాల మొత్తాన్ని ముందుగానే చెల్లించేసింది.
ఇవి కూడా చదవండి : దేశ నలుమూలల్లో 5జీ.. ఆ ప్రాంతాలపై ఫోకస్..: కేంద్ర మంత్రి