Samsung: శ్రీపెరంబుదూర్ యూనిట్‌లో సమ్మె విరమించిన శాంసంగ్ కార్మికులు
ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందంలో వేతనాల పెంపు సహా పలు డిమాండ్లను కంపెనీ ఇప్పటికే అంగీకరించింది
దిశ, బిజినెస్ బ్యూరో: తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ యూనిట్‌లో 37 రోజులుగా శాంసంగ్ కార్మికులు చేస్తున్న సమ్మె ఎట్టకేలకు ముగిసింది. తమిళనాడు ప్రభుత్వం, యాజమాన్యంతో జరిగిన విస్తృత చర్చల అనంతరం సమ్మెను విరమిస్తూ యూనియన్ నిర్ణయించింది. ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందంలో వేతనాల పెంపు సహా పలు డిమాండ్లను కంపెనీ ఇప్పటికే అంగీకరించింది. అయితే, మరికొన్ని డిమాండ్లపై చర్చకు కూడా కంపెనీ సముఖత చూపలేదు. ప్రధాన డిమాండ్ అయిన యూనియన్ గుర్తింపు అంశం ఇంకా పరిష్కరించబడలేదు. దాంతో సీఐటీయూ సమ్మెను కొనసాగించింది. ప్రస్తుతం కోర్టు నిర్ణయం పెండింగ్‌లో ఉన్నప్పటికీ అధికారికంగా ఆమోదించాలని కంపెనీపై ఒత్తిడి పెంచింది. మంగళవారం యూనియన్ నమోదు అభ్యర్థనకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో న్యాయపరమైన తీర్పు కోసం వేచి ఉండాలని భావించారు. దీంతో సమ్మె విరమించాలని యూనియన్ నిర్ణయించింది. రాజీ చర్చల తర్వాత యాజమాన్యం నుంచి ప్రతినిధులు, సమ్మెలో ఉన్న కార్మికులు సమ్మెను వెంటనే విరమించి తమ విధులను కొనసాగించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. మళ్లీ పనులు ప్రారంభిస్తే సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని యాజమాన్యం హామీ ఇచ్చింది. 2024 అక్టోబర్ 15న కార్మిక సంక్షేమ శాఖ అధికారులతో రాజీ చర్చలు జరిగాయని ప్రభుత్వం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.