ఆ విభజనలో బీజేపీయే దోషి: కే రామకృష్ణ

Update: 2022-02-09 11:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: పార్లమెంట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. మోడీపై ఇతర పార్టీలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా, అస్తవ్యస్తంగా విభజించడానికి బీజేపీయే కారణమని ఆరోపించారు. నాడు బీజేపీ సమర్థించకపోతే విభజన జరిగేదా అని నిలదీశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడటానికి బీజేపీ, కాంగ్రెస్‌లే కారణమని ఆరోపించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపైనా సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని చెప్పుకొచ్చారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రధాన డిమాండ్ అయిన అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. 43 శాతం ఫిట్‌మెంట్ అందుకున్న ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్ ఏ రకంగా ప్రయోజనకరమో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో వామపక్ష నేతలు సమావేశమై భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమాన్ని తాము ముందుండి నడిపిస్తామని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ వెల్లడించారు.

Tags:    

Similar News