నాగార్జునసాగర్‌ను బీజేపీ లైట్ తీసుకుందా..?
దిశ, తెలంగాణ బ్యూరో: సాగర్ పై కమల నాథులు ఆశలు వదులుకున్నారా..? అందుకే మొక్కుబడిగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారా..? గౌరవ ప్రదమైన ఓట్లు వస్తే చాలనే భావనలో ఆ పార్టీ నాయకత్వం ఉందా..? గెలుపు అవకాశాలు లేని సెగ్మెంట్లో ప్రచారమెందుకనే జాతీయ నాయకులు క్యాంపెయిన్ కు రాలేదా..? అంటే అవుననే బీజేపీలోని వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికల గెలుపు, జీహెచ్ఎంసీ సక్సెస్ తో నాగార్జున సాగర్ లో సత్తా చాటాలని బీజేపీ […]
దిశ, తెలంగాణ బ్యూరో: సాగర్ పై కమల నాథులు ఆశలు వదులుకున్నారా..? అందుకే మొక్కుబడిగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారా..? గౌరవ ప్రదమైన ఓట్లు వస్తే చాలనే భావనలో ఆ పార్టీ నాయకత్వం ఉందా..? గెలుపు అవకాశాలు లేని సెగ్మెంట్లో ప్రచారమెందుకనే జాతీయ నాయకులు క్యాంపెయిన్ కు రాలేదా..? అంటే అవుననే బీజేపీలోని వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికల గెలుపు, జీహెచ్ఎంసీ సక్సెస్ తో నాగార్జున సాగర్ లో సత్తా చాటాలని బీజేపీ అనుకుంది. కానీ దుబ్బాక సెగ్మెంట్ లాంటి బలమైన అభ్యర్థి సాగర్‌లో లేకపోవడం, గ్రేటర్ వంటి పరిస్థితులు ఈసారి లేకపోయేసరికి కమలనాథులు కొంత ఢీలా పడ్డారనే చర్చలు నడుస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నుంచి ఎంసీ కోటీరెడ్డి కానీ తేరాపు చిన్నపురెడ్డి కానీ బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నాయకత్వం భావించింది. ముఖ్యంగా కోటీరెడ్డి తమ పార్టీలోకి వస్తే కొంత బలం పుంజుకోవచ్చని కమలనాథులు అంచనా వేశారు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ఇష్టపడకపోవడం..కోటీరెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేయడంతో కమలనాథుల ఆశలు సన్నగిల్లాయి.
అయితే సాగర్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ బీసీ, రెడ్డి సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయించడంతో.. నియోజకవర్గంలో గిరిజన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న రవి నాయక్ కు టికెట్ కేటాయించడం ద్వారా కొంత బలం పుంజుకోవచ్చని ఆయనకే భీ పాం ఇచ్చింది బీజేపీ. దీనికి తోడు రాష్ట్ర నాయకత్వాన్ని విభజించి సాగర్ ప్రచారములో బహు ముఖ వ్యూహంతో ముందుకెళ్లాని భావించింది. బూత్ స్థాయి, శక్తి కేంద్రాలు, మండల, సెగ్మెంట్‌ల స్థాయిల్లో ప్రచారాన్ని ఉధృతం చేస్తామని చెప్పింది. జాతీయ స్థాయి నాయకులు,కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి క్యాంపెయిన్‌ను హీటెక్కిస్తామని చెప్పుకొచ్చింది.
అయితే ప్రచారం ప్రారంభంలో నాయకత్వం చెప్పిన మాటలను వారే సీరియస్ గా తీసుకోలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఖచ్చితంగా గెలుస్తామో..? లేదో..? అనే అనుమానంతోనే రాష్ట్ర నాయకత్వం మొక్కుబడిగా ప్రచారం చేసిందనే డిస్కషన్ క్యాడర్ లో నడుస్తోంది. జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి వారు క్యాంపెయిన్ చేసినా క్యాడర్ లో ఊపు తీసుకురాలేకపోయారనే టాక్ ఉంది. బీజేపీ అభ్యర్థికి ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ లేదనే డిస్కషన్ జరుగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ లతో పోల్చి చూస్తే సాగర్ లో బీజేపీకి పటిష్ట పునాదులు లేవనే చర్చ ఉంది.
సిట్టింగ్ సీటును మళ్లీ కైవశం చేసుకోవాలని టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జానారెడ్డి కూడా ఆ సారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇరు పార్టీలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రెండు పార్టీలు అర్ధ, అంగ బలాలను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇందుకోసం ఇతర పార్టీ నేతలకు బంఫర్ ఆఫర్లు ఇస్తున్నారనే డిస్కషన్ జరుగుతోంది. అయితే బీజేపీ మాత్రం వీటన్నింటిని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. బీజేపీ బూత్ లెవెల్ లో కూడా అవసరమైన ఆర్థిక సపోర్టును అందించడం లేదని, ఈ నేపథ్యంలోనే క్యాడర్ కూడా అసంతృప్తితో ఉందనే ప్రచారముంది. అయితే సాగర్ లో బీజేపీకి అనుకూల పవనాలు లేకపోవడంతోనే నాయకత్వం సీరియస్ గా రియాక్ట్ కావడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలక్షన్ ముందు రోజు కూడా నాయకత్వం తీరు ఇలాగే ఉంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడితే బీజేపీకి 3వ స్థానామే దక్కవచ్చనే చర్చ నడుస్తోంది.