గ్రేటర్‌లో ‘పద్మ’ వ్యూహం…
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర నాయకులు పార్టీ కార్యక్రమాలు చేపట్టడం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, గ్రేటర్ల ఓట్ల తగ్గింపుపై ఆందోళనలు చేయడం వంటి కార్యక్రమాలతో నగరంలో నిత్యం వార్తల్లో ఉండేట్టు ప్రణాళికలను సిద్ధం చేసింది. కార్యకర్తలు, నాయకులు, ప్రజల దృష్టి మరల్చకుండా కొత్త తరహా పబ్లిసిటీకి తెరలేపింది. మరోవైపు టీఆర్ఎస్ పైనా, ప్రభుత్వం తీరుపై, ఎంఐఎంపైనా విమర్శనారోపణలు […]
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర నాయకులు పార్టీ కార్యక్రమాలు చేపట్టడం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, గ్రేటర్ల ఓట్ల తగ్గింపుపై ఆందోళనలు చేయడం వంటి కార్యక్రమాలతో నగరంలో నిత్యం వార్తల్లో ఉండేట్టు ప్రణాళికలను సిద్ధం చేసింది. కార్యకర్తలు, నాయకులు, ప్రజల దృష్టి మరల్చకుండా కొత్త తరహా పబ్లిసిటీకి తెరలేపింది. మరోవైపు టీఆర్ఎస్ పైనా, ప్రభుత్వం తీరుపై, ఎంఐఎంపైనా విమర్శనారోపణలు సంధిస్తోంది.
ఊపిరి సల్పకుండా…
నగరంపై బీజేపీ పట్టు బిగిస్తోంది. ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకునేందుకు ఓ వైపు కేంద్ర మంత్రిని రంగంలోకి దింపింది. మరో వైపు రాష్ట్ర, జాతీయ కార్యవర్గాన్ని ప్రచారంలో నిలిపింది. ఈ క్రమంలోనే గత శనివారం నుంచి రోజూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతోంది. శనివారం కంటోన్మెంట్ బోర్డు సభ్యుల చేరిక, ఆదివారం బేగంపేట్ లో సభలు, సోమవారం మైలార్ దేవ్ పల్లి లో కార్పొరేటర్ చేరిక, మంగళవారం దుబ్బాక రిజల్ట్స్ సంబురాలు, బుధవారం బీసీల గోస, గురువారం మేడ్చెల్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, ఎన్నికల కమిషన్ ను కలవడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఇవి ఇవి జరుగుతుండగానే రాష్ట్ర నాయకులు మీడియా సమావేశాల్లో ప్రభుత్వం, టీఆర్ఎస్ తీరుపై విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. గ్రేటర్ లో ఓటర్ల జాబితాలోపాలు, దుబ్బాకలో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును చర్చకు పెడుతున్నారు. దీంతో ప్రజల్లో బీజేపీపై సానుభూతి, సమర్థవంతమైనదనే అభిప్రాయం కలిగిస్తున్నారు. ఇలాగే ముందుకెళ్తే 100 డివిజన్లకు చేరువ కావడం తేలికనే భావన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
రంగంలోనే కేంద్ర మంత్రి..
పార్టీ నాయకులు తమ పనిని ప్రణాళికాబద్ధంగా చేపడుతూ వెళ్తుండగానే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నెల రోజుల కిందటే గ్రేటర్ హైదరాబాద్ లో రంగంలోకి దిగారు. అధికారిక కార్యక్రమాలను చేపడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న పథకాలను క్షేత్రస్థాయిలో చర్చ జరిగేలా చేస్తున్నారు. వీధి వ్యాపారులు, కార్మికులు, మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు, ఆర్థిక సహాయం వంటివి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా సమీక్షా సమావేశాలను నిర్వహించారు. లేబర్ విభాగంతో సమావేశమయ్యారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో అందిస్తున్న బియ్యం, సరుకులు వంటివి పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. అంతా గమనిస్తే ఆయన గ్రేటర్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ లో తిష్టవేసి ప్రజల చూపును పార్టీవైపు తిప్పేలా చేస్తున్నది తెలిసిపోతున్నది.