జగన్ సర్కార్‌ని వదిలేదిలేదంటున్న బీజేపీ.. త్వరలో పోరుబాట
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బీజేపీ అనేకసార్లు నిరసనలకు దిగింది. సత్యాగ్రహ దీక్ష, ఉపవాస దీక్ష, మౌన దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చాటుకుంటుంది. తాజాగా మరోపోరుబాటకు ‘రెఢీ’ అయ్యింది. ‘వైజాగ్ నాట్‌ఫర్ సేల్’ పేరుతో రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విలువైన భూములను ప్రభుత్వ అప్పులకు హామీలుగా ఉంచాలని యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బీజేపీ అనేకసార్లు నిరసనలకు దిగింది. సత్యాగ్రహ దీక్ష, ఉపవాస దీక్ష, మౌన దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చాటుకుంటుంది. తాజాగా మరోపోరుబాటకు ‘రెఢీ’ అయ్యింది. ‘వైజాగ్ నాట్‌ఫర్ సేల్’ పేరుతో రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విలువైన భూములను ప్రభుత్వ అప్పులకు హామీలుగా ఉంచాలని యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విశాఖను రాష్ట్ర పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖలో ప్రభుత్వ భూములను అప్పులకు హామీగా ఉంచాలని చూస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలతోపాటు కోర్టులను సైతం ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆదివారం జరిగే కోఆర్డినేషన్ సమావేశంలో తేదీలను సైతం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అంశం పెద్ద దుమారాన్నే రేపింది. ఇసుక కొరతపై బీజేపీ ఇసుక సత్యాగ్రహ దీక్షను చేపట్టింది. అనంతరం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న టీటీడీ భూముల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ బీజేపీ నేతలు ఉపవాస దీక్షలు చేపట్టారు.
అనంతరం మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఒక్కరోజు మౌన దీక్ష చేపట్టారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు, బిల్డ్ ఏపీ పేరుతో భూముల అమ్మకం నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. ఇటీవలే ఆంధ్రా రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టింది. ఇలా దీక్షలు, నిరసనలతో వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ముచ్చెమటలు పట్టిస్తోంది. మరి కేంద్రంలో బీజేపీ వైసీపీకి దగ్గరవుతున్న తరుణంలో మరి ఈ నిరసనలు భవిష్యత్‌లో ముగుస్తాయా లేక ఇలానే కొనసాగుతాయా అనేది వేచి చూడాలి.