ఫుల్ స్పీడ్‌లో ఈటల రాజేందర్.. ‘కమలం’లోకి ‘గులాబీ’ నేతల చేరిక అప్పుడేనా.!
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపుతో బీజేపీ తన వ్యూహానికి పదును పెట్టింది. డీమోరల్ అయిన టీఆర్ఎస్‌ను మరింతగా వీక్ చేయడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నది. ఆ పార్టీలోని నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఈటలను వాడుకోవాలనుకుంటున్నది. అసంతృప్తి, అసమ్మతి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నది. డిసెంబరు 10వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తైన తర్వాత బీజేపీ గూటికి వారిని లాగే కార్యక్రమాన్ని తెరమీదకు తేవాలనుకుంటున్నది. అప్పటివరకు గుట్టు చప్పుడు […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపుతో బీజేపీ తన వ్యూహానికి పదును పెట్టింది. డీమోరల్ అయిన టీఆర్ఎస్‌ను మరింతగా వీక్ చేయడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నది. ఆ పార్టీలోని నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఈటలను వాడుకోవాలనుకుంటున్నది. అసంతృప్తి, అసమ్మతి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నది. డిసెంబరు 10వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తైన తర్వాత బీజేపీ గూటికి వారిని లాగే కార్యక్రమాన్ని తెరమీదకు తేవాలనుకుంటున్నది. అప్పటివరకు గుట్టు చప్పుడు కాకుండా గ్రౌండ్ వర్క్‌కే పరిమితం కావాలనుకుంటున్నది.
టీఆర్ఎస్ పార్టీ నుంచి కనీసంగా అర డజను మంది కీలక నేతలు తొందర్లోనే పార్టీలో చేరుతారని సీనియర్ నేత ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. వీళ్లంతా గతంలో ఎమ్మెల్యే టికెట్టు ఆశించిన వాళ్లేనని తెలుస్తున్నది. కొందరు ఎమ్మెల్సీ టికెట్టు ఆశించి భంగపడిన వారు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీని కూడా బలహీనం చేయడంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆ పార్టీలోని నేతలతో సంబంధాలు ఉన్న డీకే అరుణ ఈ టాస్కును చేపట్టినట్లు సమాచారం.
ఇప్పటికే కొద్దిమందితో సంప్రదింపులు పూర్తిఅయినట్టు తెలిసింది. వ్యక్తులుగా వీరిద్దరికి తోడు మరికొద్ది మందిని కూడా రంగంలోకి దించుతున్నది. కులపరమైన సంబంధాలతో కమలం గూటికి చేర్చే బాధ్యతలను అప్పజెప్పింది. ప్రస్తుతానికి నియోజకవర్గ స్థాయి లీడర్లపై మాత్రమే బీజేపీ ఫోకస్ పెట్టింది. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలతో ఈ ఆకర్ష్ ప్రక్రియను మొదలుపెట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌ను ఓడించే స్థాయికి చేరుకోవాలన్నది రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ హైకమాండ్ ఇచ్చిన టాస్క్.
హుజూరాబాద్ తర్వాత పెరిగిన జోరు..
గతంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలిచిన ఉత్సాహం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక టానిక్‌లాగా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు హుజూరాబాద్‌లో గెలుపు మాత్రం రెట్టించిన ఉత్సాహాన్నే ఇచ్చింది. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ ముఖం చూసే ప్రజలు ఓట్లు వేస్తారని హుజూరాబాద్ ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారు. కానీ, చివరికి టీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో బీజేపీకి సరికొత్త కాన్ఫిడెన్సును ఇచ్చినట్లయింది. టీఆర్ఎస్ బలహీనపడుతున్నదనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ ఆ పార్టీలో ఇమడలేకపోతున్నవారిని, అసంతృప్తులను గుర్తించి లాగేయాలనుకుంటున్నది.
ఇప్పటికే అలాంటి నియోజకవర్గాలు, ఆ స్థాయి నేతలను గుర్తించింది. ఒక రౌండ్ సంప్రదింపులు కూడా పూర్తిచేసింది. సమయాన్ని చూసి చేర్చుకోవాలనుకుంటున్నది. వారి స్థాయిని బట్టి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో చేర్చుకోవడమా లేక ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లడమా అనేదానిపై నిర్ణయం ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నేత ఒకరు వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకున్నా భిన్నమైన ఫలితం రావడంతో పార్టీ శ్రేణుల్లోనే నిరాశ నెలకొన్నదని, ముఖ్యమంత్రి సైతం ఆ ఫలితాన్ని జీర్ణించుకోలేక రకరకాల కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మరల్చారని బీజేపీ నేత గుర్తుచేశారు.
అప్పటి నుంచి వడ్ల కొనుగోలు అంశం మొదలైందని, ఇప్పటికీ దాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లి వేడి తగ్గకుండా చేస్తున్నారని ఉదహరించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారని, హుజూరాబాద్ రిజల్టుతో ప్రజల్లో పార్టీ పల్చనవుతున్నదనే అభిప్రాయానికి వచ్చారని, ఈ అంశమే ఇప్పుడు తమకు కీలకంగా మారిందని వివరించారు. ఆ పార్టీని మరింత బలహీనం చేయడానికి ఇదే అనువైన సమయం అని తాము భావించామని, అందువల్లనే ఇక చేరికల పర్వాన్ని ఉధృతం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
టర్నింగ్ పాయింట్‌గా హుజూరాబాద్..
రాష్ట్ర చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని ఉదహరించాల్సి వస్తే ఇకపైన హుజూరాబాద్ ఫలితానికి ముందు, తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని ఆ నేత వివరించారు. టీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి హుజూరాబాద్ ఫలితం టర్నింగ్ పాయింట్‌గా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు రాజకీయ అంశాలే ప్రధానంగా ఉంటాయని, బీజేపీని బలోపేతం చేయడానికి, టీఆర్ఎస్‌ను ఓడించడానికి ప్రక్రియ మొదలైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నుంచి కంటికి కనిపించే తీరులో పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని, అవకాశాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు టఫ్‌గానే ఉంటాయన్నారు.