జీహెచ్ఎంసీలో నిలిచిపోయిన అత్యవసర సేవలు..!
దిశ, తెలంగాణ బ్యూరో: ఏ పని చేపట్టినా జీహెచ్ఎంసీ అధికారుల్లో ముందు చూపు కొరవడటంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారుల తీరుతో నగరవాసులకు అందించే అత్యవసర సేవలు స్తంభించాయి. సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బల్దియా హెల్త్ వింగ్ బిజీగా ఉండటంతో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు వైఫల్యమే నిలిచివేతకు కారణం. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారంతా లాక్‌డౌన్ సడలింపు సమయంలో బల్దియా సర్కిల్ ఆఫీసుల చుట్టూ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఏ పని చేపట్టినా జీహెచ్ఎంసీ అధికారుల్లో ముందు చూపు కొరవడటంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారుల తీరుతో నగరవాసులకు అందించే అత్యవసర సేవలు స్తంభించాయి. సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బల్దియా హెల్త్ వింగ్ బిజీగా ఉండటంతో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు వైఫల్యమే నిలిచివేతకు కారణం. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారంతా లాక్‌డౌన్ సడలింపు సమయంలో బల్దియా సర్కిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో సర్కిల్ మెడికల్ ఆఫీసర్ల కార్యాలయం జారీ చేసే ఈ సర్టిఫికెట్లను పదేళ్ల నుంచి జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీసు సెంటర్లలో జారీ చేస్తున్నారు.
మామూలు రోజుల్లోనే అంతంతమాత్రంగా విధులు నిర్వర్తించే ఈ సెంటర్ల సిబ్బంది ఇప్పుడు వ్యాక్సినేషన్ పేరిట ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. అధికారుల ఇష్టారాజ్యంతో మహానగరంలో ప్రతి రోజు నమోదయ్యే జనన, మరణాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ప్రతి రోజు 3 వేల నుంచి మూడున్నర వేల వరకు బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేసేవారు. అందులో సుమారు 10 నుంచి 20 శాతం వరకు తప్పులతడకలే. ప్రతి సర్కిల్‌లో బర్త్, డెత్‌లను నమోదు చేసి సర్టిఫికెట్లను జారీ చేయాల్సిన సిబ్బంది, కంప్యూటర్ ఇతరాత్ర ఐటి పరికరాలన్నీ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు వినియోగిస్తున్నందున.. ఈ ప్రక్రియ నిలిచిపోయిందని పలువురు సిబ్బంది చెప్పుకొస్తున్నారు.
దరఖాస్తుదారుల ఆందోళన
బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం కావడంతో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోందని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మరణించిన వ్యక్తుల బ్యాంక్ డిపాజిట్లు, బ్యాలెన్స్, ఇతర ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఇది జీహెచ్ఎంసీ నుంచి పొందేందుకు.. బాధిత కుటుంబ సభ్యులు 21 రోజుల లోపు స్థానిక సర్కిల్ మెడికల్ ఆఫీసర్‌కు.. మరణం తాలూకు వివరాలు, అంత్యక్రియలు నిర్వహించిన స్మశానవాటిక నిర్వాహకులు ఇచ్చే సర్టిఫికెట్‌ను జతపరిచాలి. అనంతరం బల్దియా అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందితే మాత్రం.. డెత్ డిక్లరేషన్‌తోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు.
డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్న ఆ తర్వాత సంబంధిత సర్కిల్ సిబ్బంది ఆ అప్లికేషన్‌ను క్షేత్ర స్దాయిలో పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరిగినా, ప్రాసెస్ మరింత కష్టతరంగా మారే అవకాశముందని అధికారులే చెబుతున్నారు. అయినా, ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన కొనసాగుతున్న సమయంలో సంభవించిన మరణాల వివరాలను సమర్పించేందుకు.. సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం తీసుకునే నాథుడే లేడని దరఖాస్తుదారులు వాపోతున్నారు. లాక్‌డౌన్ సమయంలో కరోనా వ్యాక్సినేషన్లను మినహాయింపు ఇచ్చిన అధికారులు.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మినహాయింపులేమైనా ఇస్తారా? అన్న స్పష్టత కూడా లేకపోవడంతో దరఖాస్తుదారులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.