వారెవ్వా.. ఆటోలో మినీ గార్డెన్
దిశ, వెబ్‌డెస్క్ : పుట్టి, పెరిగిన ఊరంటే అందరికీ మమకారమే. సొంత ఊరిని వదిలి పెట్టి రావాలంటే.. ఎవరికీ మనసొప్పదు. అయితే ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో.. పల్లెను వీడి పట్టణాలకు రావాల్సిందే. అలానే ఒడిషా, కందమాల్ జిల్లాలోని పూల్‌బని ఊరికి చెందిన ఆటోడ్రైవర్ సుజిత్ దిగల్ కూడా జీవనాధారం కోసం పట్టణానికి వచ్చాడు. అలా భువనేశ్వర్ సిటీలో ఆటో నడుపుకుంటున్న సుజిత్.. తన ఆటోను ఓ మినీ గార్డెన్‌గా మార్చేశాడు. మరి ఆటోను గార్డెన్‌గా ఎందుకు […]
దిశ, వెబ్‌డెస్క్ :
పుట్టి, పెరిగిన ఊరంటే అందరికీ మమకారమే. సొంత ఊరిని వదిలి పెట్టి రావాలంటే.. ఎవరికీ మనసొప్పదు. అయితే ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో.. పల్లెను వీడి పట్టణాలకు రావాల్సిందే. అలానే ఒడిషా, కందమాల్ జిల్లాలోని పూల్‌బని ఊరికి చెందిన ఆటోడ్రైవర్ సుజిత్ దిగల్ కూడా జీవనాధారం కోసం పట్టణానికి వచ్చాడు. అలా భువనేశ్వర్ సిటీలో ఆటో నడుపుకుంటున్న సుజిత్.. తన ఆటోను ఓ మినీ గార్డెన్‌గా మార్చేశాడు. మరి ఆటోను గార్డెన్‌గా ఎందుకు మార్చాడు? అందుకు ప్రేరణ ఏమిటి?
ఎవరు అవునన్నా, కాదన్నా.. సొంతూరులో ఉన్న అనుభూతి ఇంకెక్కడ దొరకదు. ఉపాధి కోసం నగరాల్లో జీవిస్తున్నా అక్కడి గజిబిజీ జీవితం.. మనసును కుదురుగా ఉండనీయదు. భువనేశ్వర్‌లో ఆటోడ్రైవర్ సుజిత్ పరిస్థితి కూడా అదే. కరోనా వల్ల నగరానికి వచ్చి ఆటోడ్రైవర్‌గా నాలుగు డబ్బులు సంపాదిస్తున్నా.. తనకు మాత్రం పదే పదే ఇల్లు గుర్తుకొస్తుండేదట. అందుకే తన ఊరు, ఇంటి జ్ఞాపకాలను మరిచిపోవడానికి సుజిత్ తన ఆటోలోనే ఊరి వాతావరణాన్ని సృష్టించాడు. అంతేకాదు అంత పెద్ద నగరంలో ఒంటరిగా ఫీలైన సుజిత్.. తనకు తోడుగా చిలుకలు, కుందేలు, చేపలు కూడా పెంచుకుంటున్నాడు. వాటితో పాటు ఆటోనే తనకు సర్వం. అందుకే దాంట్లోనే ఓ మినీ గార్డెన్ రూపొందించాడు. ‘ఇలా చేయడం వల్ల కొంత వరకు నాకు ఉపశమనం కలిగింది. కాస్త మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోంది’ అని సుజిత్ తెలిపాడు.
సుజిత్ సృష్టించిన ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ ఆటో గార్డెన్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. తన ఆటోలో ఎక్కుతున్న ప్రయాణికులు కూడా సుజిత్ ఆలోచనకు ఫిదా అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం.. మొక్కలు పెట్టడం వరకు బాగుంది. కానీ ఇలా పక్షులు, చేపలు, కుందేళ్లను 24 గంటలు ప్రయాణంలో తిప్పడం వల్ల వాటి ఆరోగ్యానికి అంత మంచిది కాదని, అవి కూడా అలా ప్రయాణించడం వల్ల సఫోకేట్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు. సుజిత్ మినీ గార్డెన్ ఆటో ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.