లాక్‌డౌన్.. బతుకు చుట్టచుట్టె!

దిశ, ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వ్యవసాయం తర్వాత భారీస్థాయిలో ఆధారపడి ఉపాధి పొందే బీడీ పరిశ్రమ తీవ్ర నష్టాలకు గురి అవుతున్నది. కార్మికులకు చేతిలో పనిలేక ఉపాధి కోల్పోయిన పరిస్థితి నెలకొన్నది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ పరిశ్రమను మూసివేయాలని ఆదేశించడంతో లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి బీడీ కంపెనీలను మూసివేశారు. దీంతో కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. కాగా, పరిశ్రమకు తీవ్ర విఘాతం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్మికులకు తీరని నష్టం… తెలంగాణ జిల్లాల్లో […]

Update: 2020-04-20 07:35 GMT

దిశ, ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వ్యవసాయం తర్వాత భారీస్థాయిలో ఆధారపడి ఉపాధి పొందే బీడీ పరిశ్రమ తీవ్ర నష్టాలకు గురి అవుతున్నది. కార్మికులకు చేతిలో పనిలేక ఉపాధి కోల్పోయిన పరిస్థితి నెలకొన్నది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ పరిశ్రమను మూసివేయాలని ఆదేశించడంతో లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి బీడీ కంపెనీలను మూసివేశారు. దీంతో కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. కాగా, పరిశ్రమకు తీవ్ర విఘాతం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కార్మికులకు తీరని నష్టం…

తెలంగాణ జిల్లాల్లో 7 లక్షలకు పైగా బీడీ పరిశ్రమపై ఆధారపడి కార్మికుల జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక లక్షా ఇరవై వేలమంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరిలో బీడీలు చుట్టేవారు, ప్యాకింగ్ కార్మికులు, టేకెదార్లు కంపెనీ నిర్వాహకులు, ట్రాన్స్‌పోర్ట్ కార్మికులు, మేనేజర్లు ఇలా వివిధ స్థాయిలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి కార్మికులందరికీ పనిలేకుండా పోయింది. ఈ కార్మికులకు కూడా ప్రభుత్వం 12 కేజీల బియ్యం, పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇచ్చింది. వాస్తవానికి ఈ పరిశ్రమపై ఆధారపడి పని చేస్తున్న బీడీలు చుట్టే కార్మికులు మొదలుకొని వివిధ స్థాయి కార్మికులు ప్రతినెలా రూ. 5 వేల నుంచి 15 వేల దాకా సంపాదిస్తుంటారు. కానీ, పరిశ్రమ పూర్తిగా మూతపడడంతో కార్మికుల కుటుంబాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఈ పరంపర ఇలాగే కొనసాగితే బీడీ కార్మిక రంగం పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు.

పేరుకుపోయిన బీడీ ఆకు, తంబాకు నిల్వలు

బీడీ పరిశ్రమ మూతపడడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీడీ ఆకు, తంబాకు నిల్వలు పెద్ద మొత్తంలో గోదాముల్లో పేరుకుపోయాయి. కరోనా ప్రభావంతో అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎప్పటి మాదిరిగానే కార్మికులకు చేతినిండా పని ఉంటుందని ఊహించి బీడీ ఆకు కాంట్రాక్టర్లు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో బీడీ ఆకును తెప్పించి నిల్వ చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక నిర్మల్ జిల్లాలోనే 80 వేలకు పైగా బీడీ కార్మికులు పరిశ్రమను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తాజా పరిణామాలు పరిశ్రమపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.

ఆదుకోవాలి..

‘బీడీ కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. వ్యవసాయం తర్వాత పెద్ద పరిశ్రమ బీడీ పరిశ్రమనే అని గుర్తుంచుకోవాలి. ప్రతి కుటుంబానికి కనీసం నెలకు ఐదు వేల రూపాయలు చెల్లించాలి’ అని బీడీ సంఘాల నేత కె.రాజన్న ప్రభుత్వాలను కోరారు.

tags: Adilabad, Beedi workers, Beedi leaf, Nirmal

Tags:    

Similar News