బీసీసీఐకి ఐపీఎల్ కష్టాలు
దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు ఇప్పుడు క్యాష్ రిచ్ ఐపీఎల్ కోసం పలు క్రికెట్ బోర్డులను బజ్జగించే ప్రయత్నంలో పడింది. శనివారం జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు పెద్దలు నిర్ణయించారు. అయితే వేదిక, తేదీలు ఖరారు అయినా ఐపీఎల్‌కు పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. లీగ్ తేదీల దగ్గర నుంచి విదేశీ ఆటగాళ్ల గైర్హాజరు వరకు బీసీసీఐ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. లీగ్‌కు మూడున్నర నెలల […]
దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు ఇప్పుడు క్యాష్ రిచ్ ఐపీఎల్ కోసం పలు క్రికెట్ బోర్డులను బజ్జగించే ప్రయత్నంలో పడింది. శనివారం జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు పెద్దలు నిర్ణయించారు. అయితే వేదిక, తేదీలు ఖరారు అయినా ఐపీఎల్‌కు పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. లీగ్ తేదీల దగ్గర నుంచి విదేశీ ఆటగాళ్ల గైర్హాజరు వరకు బీసీసీఐ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. లీగ్‌కు మూడున్నర నెలల సమయం మాత్రమే ఉండటంతో.. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించే పనిలో పడింది. ఐపీఎల్‌కు మొదటి అడ్డంకి కరేబియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో ఎదురవుతున్నది. త్వరలోనే ఈ లీగ్ నిర్వహించనున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే లీగ్ షెడ్యూల్ మాత్రం ప్రకటించలేదు. గత సీజన్ షెడ్యూల్ బట్టి అగస్టు చివరి వారంలో మొదలై సెప్టెంబర్ చివరి వారం వరకు సీపీఎల్ జరిగే అవకాశం ఉన్నది. ఆ షెడ్యూల్ కచ్చితంగా ఐపీఎల్‌తో క్లాష్ అయ్యే అవకాశం ఉన్నది. దీంతో విండీస్ బోర్డుతో చర్చలు జరపడానికి బీసీసీఐ సిద్దపడినట్లు తెలుస్తున్నది. సీపీఎల్‌ను వారం రోజులు ముందుకు జరపడం వల్ల ఆ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లు తిరిగి యూఏఈ చేరుకొని ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉంటుందని.. అందుకే విండీస్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్‌లో కనుక మార్పు లేకపోతే పలువురు విండీస్ ఆటగాళ్లు కూడా తొలి వారంలో ఐపీఎల్ మిస్అయ్యే అవకాశం ఉన్నది.
విదేశీ ఆటగాళ్ల పాలసీ..
ఐపీఎల్ యూఏఈ వేదికగా నిర్వహించడం ఖాయం అవడంతో ఇప్పుడు ఫ్రాంచైజీలు విదేశీ ఆటగాళ్లను భర్తీ చేసే అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఆటగాళ్ల బదిలీ, ట్రేడ్, కొత్త ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ జరిగే అవకాశం లేకపోవడంతో పలు ఫ్రాంచైజీలు నష్టపోనున్నాయి. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కచ్చితంగా ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఫ్రాంచైజీలు బీసీసీఐ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. మిగిలిన 31 మ్యాచ్‌లకు దాదాపు 40 మంది ఆటగాళ్లు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉంటుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా లీగ్ ఆడేది అనుమానంగా మారింది. అందుకే విదేశీ ఆటగాళ్ల రిప్లేస్‌మెంట్ పాలసీ ప్రకటించాలని పలు ఫ్రాంచైజీలు బీసీసీఐని డిమాండ్ చేస్తున్నాయి. ‘మేం ఇప్పటికే మా జట్టులో ఎవరిని తీసుకోవాలనే విషయంపై ఒక నిర్ణయం తీసుకున్నాము. అయితే రిప్లేస్‌మెంట్ పాలసీపై బీసీసీఐ అధికారికంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే వారిని చేర్చుకుంటాము’ అని పంజాబ్ కింగ్స్ సీఈవో సతీశ్ మీనన్ తెలిపారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీతో భారీగా నష్టపోనున్నాయి. ఈ ఫ్రాంచైజీలన్నీ బీసీసీఐ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాయి.
షెడ్యూల్ దాదాపు కన్ఫార్మ్
యూఏఈలో ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ దాదాపు కన్ఫార్మ్ చేసింది. రెండో ఫేజ్ ఐపీఎల్ సెప్టెంబర్ 17న ప్రారంభించాలని భావిస్తున్నది. మూడు వారాల్లోనే లీగ్ ముగించేలా ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తున్నది. అక్టోబర్ 10న ఐపీఎల్ ఫైనల్ జరిగే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. క్రికెట్ వెస్టిండీస్‌తో ఒక సారి చర్చలు ముగిసిన అనంతరం ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నది. సెప్టెంబర్ 14న ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు వెంటనే యూఏఈ వస్తారని.. వాళ్లు అప్పటికే బయోబబుల్‌లో ఉంటారు కాబట్టి నేరుగా ఆయా ఫ్రాంచైజీలతో కలుస్తారని బీసీసీఐ చెబుతున్నది. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో లేని ఇతర ఇండియన్, ఫారిన్ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలే యూఏఈకి తరలిస్తాయి. దాదాపు సెప్టెంబర్ తొలి వారంలోనే ఆటగాళ్ల కోసం దుబాయ్ లేదా అబుదాబీలో క్వారంటైన్ ఏర్పాటు చేస్తారు. ఏదేమైనా విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీలో కూడా ఐపీఎల్‌ను విజయవంతం చేయాలని బీసీసీఐ భావిస్తున్నది.