నారా లోకేశ్ గారూ.. మీరెలా ఉండాలంటే.. జగన్‌లా ఉండాలి: బండ్ల గణేష్

పంచ్ డైలాగులతో రాజకీయాల్లోకి వచ్చి, డైలాగులు రాజకీయాల్లో వర్కవుట్ కావని గుర్తించి, నిష్క్రమించిన టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ట్వీట్ల వర్షం కురిపించారు. మీరన్నా, మీ కుటుంబమన్నా ప్రేమ అంటూ.. గౌరవంగా సంబోధిస్తూనే లోకేశ్ ప్రధాన ప్రత్యర్థి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా ఉండాలంటూ హితవు పలకడం కొసమెరుపు. గౌరవనీయులైన నారా లోకేశ్… రాజకీయాల్లో వారసత్వం కాదు, దమ్ము, ధైర్యం, పోరాడతాడన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం […]

Update: 2020-05-05 05:38 GMT

పంచ్ డైలాగులతో రాజకీయాల్లోకి వచ్చి, డైలాగులు రాజకీయాల్లో వర్కవుట్ కావని గుర్తించి, నిష్క్రమించిన టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ట్వీట్ల వర్షం కురిపించారు. మీరన్నా, మీ కుటుంబమన్నా ప్రేమ అంటూ.. గౌరవంగా సంబోధిస్తూనే లోకేశ్ ప్రధాన ప్రత్యర్థి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా ఉండాలంటూ హితవు పలకడం కొసమెరుపు.

గౌరవనీయులైన నారా లోకేశ్… రాజకీయాల్లో వారసత్వం కాదు, దమ్ము, ధైర్యం, పోరాడతాడన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం ముఖ్యమని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో కొద్దిమందికే దక్కే అదృష్టం మీకు దక్కింది, చంద్రబాబునాయుడి కుమారుడిగా పుట్టడమే ఆ అదృష్టమని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ పార్టీ అంటే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కాదని హితవు పలికారు. మన పార్టీలో ఉండే నాయకులు అంటే మనవద్ద పనిచేసే ఉద్యోగులు కాదని, ప్రతి ఒక్కరినీ ప్రేమించి, ప్రేమను పంచి మనలో ఒకరిగా చేసుకుని ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. లోకేశ్ ప్రవర్తన ఎలా ఉండాలంటే… మీ గురించి మీ నాన్నగారు ఆలోచిస్తే… గర్వంగా నిద్రపోయే రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు. అంతే కాకుండా లోకేశ్ పని తీరు ద్వారా బాబును నారా లోకేశ్ తండ్రి అని చెప్పుకునేలా ఉండాలని సూచించారు.

ఉదాహరణ కావాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌లా ఉండాలన్నారు. లేదా తండ్రి మరణానంతరం ప్రత్యర్థులంతా ఒక్కటై అణచివేయాలని చూసినా అందరినీ ఎదిరించి తొమ్మిదేళ్లు పోరాడి ఘనవిజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డిలా ఉండాలని ఆయన సూచించారు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌లా తండ్రికి పోటీ ఇచ్చే కొడుకులా ఉండాలి. ఎవరూ, ఎలాంటి సపోర్ట్ చేయకపోయినా నంబర్ వన్ స్థాయికి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లా ఉండాలని ఆకాంక్షించారు.

అయితే లోకేశ్‌ను చూస్తే తనకు భయమేస్తోందని, రాజకీయాల్లో పట్టు సాధించలేరేమోననిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు కుమారుడిగా తప్ప రాజకీయంగా ఆయనకు ఎలాంటి అర్హత లేదని ఎద్దేవా చేశారు. తనకు తెలిసినంతవరకు నారా లోకేశ్ రాజకీయంగా విఫలమైన నాయకుడని అన్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా చేస్తున్న వ్యాఖ్యలు ఆయనను దిగజార్చేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వచ్చిన సమయంలో లోకేశ్ చేసిన ట్వీట్ ఆయన దిగజారుడుతనాన్ని సూచిస్తోందని విమర్శించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ లోకేశ్ అన్నా, బాబుగారన్నా, తాతగారు ఎన్టీఆర్ అన్నా గౌరవం, ప్రేమ కాబట్టే తానీ విన్నపాలు చేస్తున్నానని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు.

Tags: bandla ganesh, ex-congress contestent, twitter, tdp, nara lokesh, chandrababu, jagan, ktr

Tags:    

Similar News