ఆటో కార్మికుల జీవనం ఆగమాగం
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా ఎఫెక్ట్‌తో ఆటో కార్మికులకు కుటుంబాలను నెట్టుకు రావడం గగనంగా మారింది. అన్‌లాక్ వచ్చినా ఆటో ఎక్కేవారు కరువయ్యారు. దీంతో ఆటోలపై ఆధారపడే లక్షలాది మంది కార్మికుల పరిస్థితి సంక్షోభంలో పడింది. పెట్రోలు, డీజిల్ ధరలు సైతం పెరగడంతో ఛార్జీలు గిట్టుబాటు కాక ఎక్కడి ఆటోలు అక్కడే ఉండిపోతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చినవారికి ఆటోలు పొట్ట నింపుతున్నాయి. ఏ ఉద్యోగం లేకపోయినా ఆటో నడిపి బతకవచ్చనే ధైర్యం ఇంతకాలం […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా ఎఫెక్ట్‌తో ఆటో కార్మికులకు కుటుంబాలను నెట్టుకు రావడం గగనంగా మారింది. అన్‌లాక్ వచ్చినా ఆటో ఎక్కేవారు కరువయ్యారు. దీంతో ఆటోలపై ఆధారపడే లక్షలాది మంది కార్మికుల పరిస్థితి సంక్షోభంలో పడింది. పెట్రోలు, డీజిల్ ధరలు సైతం పెరగడంతో ఛార్జీలు గిట్టుబాటు కాక ఎక్కడి ఆటోలు అక్కడే ఉండిపోతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చినవారికి ఆటోలు పొట్ట నింపుతున్నాయి. ఏ ఉద్యోగం లేకపోయినా ఆటో నడిపి బతకవచ్చనే ధైర్యం ఇంతకాలం వారిని ముందుకు నడిపించింది. కానీ ఇప్పుడు కరోనాతో ఏ భరోసా లేకుండా పోయింది. నగరంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోలు ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు లక్షన్నర వరకు ఉంటాయి. ఇక గుర్తింపు లేకుండా ప్రైవేటు, సరుకు రవాణా కోసం ఉన్నవి మరో 50వేలు ఉండొచ్చని అంచనా. సుమారు 4లక్షల మంది ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం సరుకు రవాణా లేకపోవడం, స్కూళ్ళ మూసివేత, లాక్‌డౌన్‌తో రాకపోకలు తగ్గి ఇబ్బందులు వస్తున్నాయి. గతంలో రోజుకు రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకు సంపాదించేవారు. అన్ని ఖర్చులూ పోగా రూ. 800 వరకు మిగిలేవి. ఇప్పుడు రోజంతా కష్టపడ్డా రూ.100 సంపాదించలేక పోతున్నారు.
హైదరాబాద్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆటోలు ఎక్కేందుకు జంకుతున్నారు. ఆటోలో ఇద్దరికంటే ఎక్కువగా ఎక్కించుకోవద్దన్న పోలీసుల ఆంక్షలతో పాటు శానిటైజర్స్ వాడుతుండటంతో అదనపు ఖర్చుగా మారింది. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరిగాయి. అద్దెకు తీసుకున్న ఆటోలకు డబ్బులు కట్టుకోలేక, సొంత ఆటోలు ఉన్నావారు ప్రతీనెలా ఈఎంఐలతో సతమతం అవుతున్నారు. ఇక ప్రైవేటు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించలేక పోవడంతో ఫైనార్షియర్ల నుంచి వేధింపులు పెరిగి సొంతూళ్లకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు.
ఆటో ఎక్కడానికి భయపడుతున్నారు
“నాలుగు నెలల నుంచి ఆటోకు గిరాకీ లేదు. కుటుంబాన్ని సాకడం కష్టమవుతోంది. వేరే పని చేద్దామంటే పని ఇచ్చేవారు లేరు. కరోనా కష్టకాలంలో బతుకు భారమైంది. ఫైనాన్స్ వాళ్లు కిస్తీలు చెల్లించాలని వేధిస్తున్నారు. గిరాకీ వచ్చుడేమో గాని శానిటైజర్ లాంటి అవసరాలకు ఆదనంగా ఖర్చవుతోంది. ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్టు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలి” అని ఎల్బీ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జంగయ్య వాపోయాడు.
పొద్దంతా నడిపినా కూలీ గిట్టడం లేదు
లాక్‌డౌన్‌ను సడలించినా ఇద్దరి కంటే ఎక్కువ ఎక్కించుకోవద్దని ప్రభుత్వం నిబంధన పెట్టింది. రేటు పెంచకుంటే గిట్టుబాటు కాదు. ఎక్కించుకుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారు. పాత రేట్లకు ఆటో నడిపితే గిట్టుబాటు కాదు. పెంచితే ఎక్కేవారు ఉండరు. కొద్దో గొప్పో ఓ వంద రూపాయలు వచ్చాయంటే శానిటైజర్ లాంటి వాటికే పోతున్నాయి. ఇక మేం బతికేదేట్లా? అని బాగ్‌లింగపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మల్లేశం ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆర్థిక సాయం అందించాలి
రాష్ట్రంలో కరోనా కారణంగా ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ దెబ్బతింది. డ్రైవర్లు, కార్మికులు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కాలంలో ఆటో కార్మికులకు నెలకు రూ. 5వేలు నగదు సాయం అందజేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా రూ.7500 చొప్పున సాయం చేసి కార్మికులను ఆదుకోవాలి” అని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు.