భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
దిశ, ఫీచర్స్: గ్రహశకలాలు భూమివైపు రావడం సహజమే. వాటివల్ల ప్రతీసారి ప్రమాదం ఉండకపోవచ్చు. గతేడాది అక్టోబర్‌లో 2020 RK2 అనే గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తుందని, దీని వల్ల ప్రమాదం ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. కానీ అలాంటిదేం జరగలేదు. ఈ క్రమంలో 2001 ఎఫ్‌వో32 అనే భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా వెల్లడించింది. దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగానే భావించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు భూమికి అతి సమీపంగా వచ్చిన గ్రహశకలాలన్నింటితో […]
దిశ, ఫీచర్స్: గ్రహశకలాలు భూమివైపు రావడం సహజమే. వాటివల్ల ప్రతీసారి ప్రమాదం ఉండకపోవచ్చు. గతేడాది అక్టోబర్‌లో 2020 RK2 అనే గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తుందని, దీని వల్ల ప్రమాదం ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. కానీ అలాంటిదేం జరగలేదు. ఈ క్రమంలో 2001 ఎఫ్‌వో32 అనే భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా వెల్లడించింది. దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగానే భావించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు భూమికి అతి సమీపంగా వచ్చిన గ్రహశకలాలన్నింటితో పోల్చితే ఈ 2001 ఎఫ్‌వో32 వేగం గంటకు 77,000 మైళ్లు అధికంగా ఉందని పేర్కొంటున్నారు.
2001 ఎఫ్‌వో32 గ్రహశకలం మార్చి 21న భూమికి దగ్గరగా వస్తుందని నాసా వెల్లడించగా, భూమికి సమీపంగా వచ్చినప్పుడు మిగతా ప్రాంతాలతో పోల్చితే దక్షిణార్థ గోళంలో ఉన్న వారికి ఇది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. టెలిస్కోప్ సాయంతో దీన్ని వీక్షించొచ్చు. ఈ ఆస్టరాయిడ్‌ను అధ్యయనం చేయడానికి హవాయిలోని నిద్రాణమైన అగ్నిపర్వతం మౌనా కీ పైభాగంలో ఉన్న 3.2 మీటర్ల టెలిస్కోప్‌ను శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. 2001 ఎఫ్‌వో32ను మొదటిసారి మార్చి 23, 2001న న్యూ మెక్సికోలోని లింకన్ నియర్-ఎర్త్ ఆస్టరాయిడ్ రీసెర్చ్ (LINEAR) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గ్రహశకలం దీర్ఘవృత్తాకార కక్ష్యను కలిగి ఉన్న ఈ ఆస్టరాయిడ్ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి దీనికి 810 రోజులు పడుతుంది. భూమికి దగ్గరగా ఉన్న గ్రహశకలాలలో 2001ఎఫ్‌వో32 లేదా అంతకుమించి పరిమాణం ఉన్న దాదాపు 95 శాతం గ్రహశకలాల జాబితా తయారు చేశామని, రాబోయే 100 సంవత్సరాలలో వాటిలో ఏ ఒక్కటీ భూమిని తాకే అవకాశం లేదని నాసా తెలిపింది. 1908, జూన్ 30న ఓ గ్రహశకలం సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో భూమిని ఢీకొట్టగా, ఈ వంద ఏళ్లలో మరో ఆస్టారాయిడ్ భూమిని తాకలేదు.
‘2001 ఎఫ్‌వో32గా పిలుస్తున్న ఈ భారీ గ్రహశకలాన్ని 2001లోనే మేం గుర్తించాం. 20 ఏళ్ల నుంచి దీన్ని ట్రాక్ చేస్తున్నాం. ఈ గ్రహశకలం భూమికి 1.25 మిలియన్ మైళ్ల కంటే దగ్గరగా రాదు. గ్రహశకలం భూమిని సమీపించే ప్రదేశం సురక్షితమే అయినా ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఖగోళపరంగా 1.25 మిలియన్ మైళ్లు (2 మిలియన్ కిమీ) దూరం చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్లే ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని నిశితంగా పరిశీలించి అనేక విషయాలను తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆస్టరాయిడ్ బ్రైట్‌నెస్, ప్రతిబింబం, పరిమాణాన్ని అధ్యయనం చేసేందుకు అవకాశముంది. ఆస్టరాయిడ్‌పై పడే సూర్యకాంతిని అధ్యయనం చేయడం ద్వారా దాని పరిమాణంతో పాటు ఉపరితలంపై ఉండే ఖనిజాలు, రసాయనాలను తెలుసుకోవచ్చు. దీని వ్యాసం సుమారు 3,000 అడుగులు ఉండొచ్చు. ఈ గ్రహశకలాన్ని అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు ఓ అద్భుతమైన అవకాశం’ అని డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డాక్టర్ పాల్ చోడాస్ వెల్లడించారు.