కొత్త మార్గాలు వెతుక్కుంటున్న చిన్న స్టార్లు
ఎలాగూ షూటింగులు పెద్దగా జరగట్లేదు, అవకాశాలు పెద్దగా ఏం లేవు, వచ్చిన పని యాక్టింగ్, యాంకరింగ్, గలగలా మాట్లాడటం, ఒకవేళ ఒకటో రెండో అవకాశాలున్నా కరోనా కారణంగా బయటికెళ్లాలంటే భయం. వెళ్దామని ధైర్యం చేసినా ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు. ఇన్ని కష్టాల మధ్యలో ఉన్న కళను బయటపెట్టడం ఎలాగ?.. సినిమా, సీరియల్ స్టార్లు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది. వరుసగా కొన్ని నెలల పాటు ప్రేక్షకులకు కనిపించకపోతే ఫేమ్ తగ్గిపోతుంది. లైమ్ లైట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. […]
ఎలాగూ షూటింగులు పెద్దగా జరగట్లేదు, అవకాశాలు పెద్దగా ఏం లేవు, వచ్చిన పని యాక్టింగ్, యాంకరింగ్, గలగలా మాట్లాడటం, ఒకవేళ ఒకటో రెండో అవకాశాలున్నా కరోనా కారణంగా బయటికెళ్లాలంటే భయం. వెళ్దామని ధైర్యం చేసినా ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు. ఇన్ని కష్టాల మధ్యలో ఉన్న కళను బయటపెట్టడం ఎలాగ?.. సినిమా, సీరియల్ స్టార్లు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది. వరుసగా కొన్ని నెలల పాటు ప్రేక్షకులకు కనిపించకపోతే ఫేమ్ తగ్గిపోతుంది. లైమ్ లైట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అసలే క్రేజ్ ఉన్నపుడే సంపాదించుకోవాలి. కాబట్టి వారికి ఉన్న దారులన్నింటినీ ఒకసారి వెనక్కి వెళ్లి సరిచూసుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలతో బుల్లితెరను వదిలేసిన వాళ్లందరూ మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. జబర్దస్త్ కొత్త ఎపిసోడ్‌లు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఇంకా లేడీ స్టార్లు కూడా మరో మార్గాన్ని వెతుక్కుంటున్నారు.
పాత ఇంటికే పయనం
జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో స్కిట్‌లు వేసి, పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు కొట్టేసిన కమెడియన్లు ఎందరో ఉన్నారు. హీరోలుగా సినిమాలు తీసిన వారు కూడా ఉన్నారు. తాగుబోతు రమేష్, చలాకీ చంటి, షకలక శంకర్ వంటి స్టార్ కమెడియన్లు ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ కార్యక్రమంలో అలరిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక పోసాని కృష్ణమురళి వంటి కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే రెగ్యులర్‌గా వచ్చే సీరియళ్లలో అతిథి పాత్రలు చేస్తున్నారు.
యూట్యూబ్ దిక్కు
ఇక కొందరు సెలెబ్రిటీలు అయితే అవకాశాల కోసం అడగలేరు, ఉన్న టాలెంట్‌ను వృథా చేయలేరు. అలాంటి వారికి యూట్యూబ్ ఆశ్రయం ఇస్తోంది. సొంతంగా ఒక చానల్ పెట్టేసి తమదైన రీతిలో కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వరుణ్ సందేశ్ భార్య, నటి వితికా శేరు ఈ లాక్‌డౌన్ సమయంలో మొదటగా యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసింది. ముందు తను పెట్టబోయే వీడియోకు సంబంధించి ప్రోమో పెట్టి, ఆ తర్వాత వీడియోను అప్‌లోడ్ చేస్తూ రెండు విధాలుగా వీక్షకులను ఆకర్షిస్తోంది. ఇక ఆమె బాటలోనే తనతో పాటు బిగ్‌బాస్‌లో ఉన్న రోహిణి, హిమజలు కూడా సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టేసుకున్నారు. పరిస్థితి ఇలాగే ఇంకొంతకాలం కొనసాగితే టీవీ ఆర్టిస్టులందరూ యూట్యూబ్‌లో హల్‌చల్ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఏదేమైనా కష్టసమయాలే కొత్త దారులను పుట్టిస్తాయన్న మాట అక్షరాల నిజమని ఈ ఆర్టిస్టుల పరిస్థితి చూస్తేనే అర్థమవుతోంది.