28 ఏళ్ల తర్వాత కోపా కప్ గెలిచిన అర్జెంటీనా

దిశ, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ తర్వాత.. ఫుట్‌బాల్ అభిమానులు అత్యధిక ఎక్కువగా వీక్షించేది యూరో కప్, కోపా అమెరికా కప్‌లే. మినీ వరల్డ్ కప్‌లుగా అభివర్ణించే ఈ రెండు టోర్నోలు రెండు ఖండాల్లో ఒకేసారి జరుగుతున్నాయి. యూరోప్‌కు సంబంధించి యూరో 2020 జరుగుతుండగానే.. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే కోపా అమెరికా కప్ కూడా నిర్వహించారు. శనివారం రాత్రి అర్జెంటీనా, బ్రెజిల్ మధ్య జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా జట్టు 1-0 తేడాతో విజయం సాధించి […]

Update: 2021-07-11 08:25 GMT
Copa-America
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ తర్వాత.. ఫుట్‌బాల్ అభిమానులు అత్యధిక ఎక్కువగా వీక్షించేది యూరో కప్, కోపా అమెరికా కప్‌లే. మినీ వరల్డ్ కప్‌లుగా అభివర్ణించే ఈ రెండు టోర్నోలు రెండు ఖండాల్లో ఒకేసారి జరుగుతున్నాయి. యూరోప్‌కు సంబంధించి యూరో 2020 జరుగుతుండగానే.. దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే కోపా అమెరికా కప్ కూడా నిర్వహించారు. శనివారం రాత్రి అర్జెంటీనా, బ్రెజిల్ మధ్య జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా జట్టు 1-0 తేడాతో విజయం సాధించి కోపా అమెరికా టైటిల్ సొంతం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్, దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీకి ఇదే తొలి అంతర్జాతీయ మేజర్ టైటిల్ కావడం గమనార్హం. మరోవైపు 1993 తర్వాత కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా గెలవడం ఇదే తొలిసారి. 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనా కోపా కప్ గెలిచి.. అత్యధికసార్లు ఈ టైటిల్ కైవసం చేసుకున్న ఉరుగ్వే (15) సరసన నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్ ఫైనల్ వరకూ చేరుకున్నా.. టైటిల్ నిలబెట్టుకోలేక పోయింది.

ఫైనల్ హీరో అతడే..

ఆట ప్రారంభమైన 22వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డి మారియా గోల్ చేయడంతో ఒక్కసారిగా మెస్సీ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ తర్వాత 88వ నిమిషంలో మెస్సీ గోల్ పోస్టుపై నేరుగా దాడి చేసినా.. బ్రెజిల్ గోల్‌కీపర్ ఎడర్సన్ అడ్డుకోవడంతో ఆధిక్యం 1-0కే పరిమితం అయ్యింది. రిఫరీ ఫైనల్ విజిల్ ఊదగానే అర్జెంటీనా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఏకైక గోల్ చేసిన ఏంజెల్ డి మారియా హీరోగా మారిపోయాడు. ఇక మెస్సీ మైదానంలోనే కూలబడి ఏడ్చేశాడు. అర్జెంటీనా ఆటగాళ్లు, అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. కానీ అదే సమయంలో బ్రెజిల్ ఆటగాడు నెయమార్ కన్నీటి పర్యంతం అయ్యాడు. మెస్సీ అతని దగ్గరకు వెళ్లి కాసేపు ఓదార్చాడు. కోపా అమెరికా 2020లో అత్యధిక గోల్స్ మెస్సీ, నెయమార్ పేరిట ఉన్నాయి. వీరిద్దరూ అత్యధికంగా 4 గోల్స్ చేశారు. కప్ అందుకున్న మెస్సీ ఆటగాళ్లతో కలసి డ్యాన్స్ చేశాడు. కానీ తొలి సారిగా అతడు ఉద్వేగంగా కనపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా అర్జెంటీనా ఆటగాళ్ల సంబరాలు ఆగిపోలేదు.

మచ్చ చెరిగినట్లేనా?

లియోనల్ మెస్సీ దిగ్గజ ఆటగాడిగా పిలవబడతాడు. చిన్న నాటి నుంచే ఫుట్‌బాల్ ఆడుతున్న మెస్సీ యూరోపియన్ క్లబ్స్‌లో బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత 16 ఏళ్లుగా ఆ జట్టు తరపున ఆడుతున్న మెస్సీ ఖాతాలో 34 ట్రోఫీలు ఉన్నాయి. 10 లాలిగా టైటిల్స్, 7 కోపా డెల్ రే టైటిల్స్, నాలుగు యూఈఎఫ్ఏ చాంపియన్ లీగ్స్ గెలిచాడు. ఒక క్లబ్ తరపున అత్యధిక టైటిల్స్ గెలిచిన మెస్సీ.. తన దేశం అర్జెంటీనా తరపున ఏనాడూ మేజర్ టైటిల్ గెలవలేదు. దీంతో అతడు కేవలం క్లబ్ ఆటగాడు అనే ముద్ర పడిపోయింది. 2014లో అర్జెంటీనాను ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వరకు తీసుకొని వచ్చినా గెలిపించలేకపోయాడు. కానీ మినీ వరల్డ్ కప్‌గా పిలిచే కోపా అమెరికా టైటిల్‌ను అందించి తనపై పడ్డ మచ్చను చెరిపేసుకున్నాడు. అందుకే మ్యాచ్ అనంతరం మైదానంలోనే కూలబడి ఉద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం బార్సిలోనా క్లబ్‌తో ఒప్పందం కూడా ముగియడంతో మెస్సీ కొత్త క్లబ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కోపా అమెరికా విజయంతో అతడి టాలెంట్ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. మాంచెస్టర్ సిటీ క్లబ్ అతడిని తీసుకోవాలని పట్టుదలతో ఉన్నది.

Tags:    

Similar News