తెలంగాణ అడ్డుచెప్పినా ఆగేది లేదు !

దిశ, న్యూస్‌బ్యూరో: రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఎన్జీటీ తీర్పు ప్రకారమే వ్యవహరిస్తున్నామని, టెండర్లకు పిలిచామని తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం అడ్డుచెప్పినా ఆగేది లేదంటూ వెల్లడించింది. ఎన్జీటీ వెలువరించిన ఉత్తర్వుల ప్రతులను, ప్రభుత్వం ఇకపైన చేపట్టనున్న కార్యాచరణను లేఖ రూపంలో కృష్ణా యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం పంపింది. రాయలసీమ ఎత్తిపోతలతో పాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపు అంశంపై ఏపీ ప్రభుత్వ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టడంతో బోర్డు […]

Update: 2020-07-22 10:12 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఎన్జీటీ తీర్పు ప్రకారమే వ్యవహరిస్తున్నామని, టెండర్లకు పిలిచామని తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం అడ్డుచెప్పినా ఆగేది లేదంటూ వెల్లడించింది. ఎన్జీటీ వెలువరించిన ఉత్తర్వుల ప్రతులను, ప్రభుత్వం ఇకపైన చేపట్టనున్న కార్యాచరణను లేఖ రూపంలో కృష్ణా యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం పంపింది. రాయలసీమ ఎత్తిపోతలతో పాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపు అంశంపై ఏపీ ప్రభుత్వ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టడంతో బోర్డు సైతం ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. కృష్ణాబోర్డు, కేంద్ర జలసంఘం కూడా ఏపీ వైఖరిని తప్పు పట్టాయి. ఈ ప్రతికూల పరిస్థితులను సవాలు చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలుచేసింది. దీనిపై విచారించిన గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీకి కొంత ఉపశమనం కలిగేలా ఆదేశాలిచ్చింది. టెండర్లు, సాంకేతిక పనులు చేసుకోవచ్చంటూ సూచించింది. పర్యావరణంపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

ఈ అంశాలను ప్రస్తావిస్తూ తాజాగా మంగళవారం రాత్రి కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖతో పాటు ఎన్జీటీ ఉత్తర్వుల ప్రతులను కూడా అందజేసింది. పోతిరెడ్డిపాడు అంశంపై తుది నిర్ణయం జరిగే వరకూ ఎలాంటి పనులు చేపట్టరాదని బోర్డు ఆదేశించిన నేపథ్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వానికి ఉపశమనం కలిగించాయి. దీంతో నోటీసులన్నింటినీ పక్కన పెట్టి టెండర్లకు దిగింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రాయలసీమకు టెండర్లు పిలిచామని స్పష్టం చేసింది. దీనిపై అడ్డు చెప్పరాదంటూ సూచించింది. కృష్ణాజలాల్లో తమ వాటాను వాడుకునేందుకే రాయలసీమ ప్రాజెక్టును నిర్మాణం చేస్తున్నామని, ఇది రాష్ట్ర విభజనకు ముందే ఉందని వెల్లడించింది. ఏపీలోని కరువు జిల్లాలకు సాగు, తాగునీటిని అందించడం, పూర్తి వాటాను వినియోగించుకునేందుకో నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంది.

మరోవైపు దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తెలంగాణ జలవనరుల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కృష్ణా బోర్డు నుంచి ఏపీకి సంబంధించి ప్రాజెక్టులు, రాయలసీమ ఎత్తిపోతలపై బోర్డు నోటీసుల వివరాలన్నీ తీసుకుంది. రాయలసీమపై స్పష్టమైన ఆదేశాలు రాకుండా ఎలా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, దీనిపై ఏపీ ప్రభుత్వానికి బోర్డు నుంచి నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. కాగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఆపడం లేదు. ఇదే నేపథ్యంలో హంద్రినీవా నుంచి 8 టీఎంసీల నీటిని తీసుకుపోయేందుకు ఏపీ ఇండెంట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకున్నా… బుధవారం సాయంత్రం నుంచి ముచ్చుమర్రి మోటర్లు ప్రారంభమైనట్లు సమాచారం. దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News