జీపీఎస్సే దిక్కా? ప్రత్యామ్నాయం లేదా.!?
దిశ, వెబ్‌డెస్క్: ‘అరేయ్… ఎక్కడున్నావ్? నువ్వు చెప్పేది అర్థం కాట్లేదు. కానీ, లొకేషన్ పంపు’, ‘అన్నా.. లొకేషన్‌కు వచ్చేయండి, నేను అక్కడే ఉన్నాను’, ‘ఈ ప్రదేశం ఎక్కడుందో… మ్యాప్‌లో చూద్దాం’… ఇవన్నీ మనం వింటున్న, అంటున్న మాటలే. ఈ మాటలన్నింటిలో కామన్‌గా ఉన్నది లొకేషన్ అంటే జీపీఎస్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్… చిన్న స్మార్ట్‌ఫోన్ నుంచి పెద్ద పెద్ద క్షిపణుల వరకూ అన్ని ఈ జీపీఎస్ ఆధారంగానే పనిచేస్తాయి. అమెరికా వారికి సొంతమైన ఈ జీపీఎస్‌ను ఇప్పుడు […]
దిశ, వెబ్‌డెస్క్: ‘అరేయ్… ఎక్కడున్నావ్? నువ్వు చెప్పేది అర్థం కాట్లేదు. కానీ, లొకేషన్ పంపు’, ‘అన్నా.. లొకేషన్‌కు వచ్చేయండి, నేను అక్కడే ఉన్నాను’, ‘ఈ ప్రదేశం ఎక్కడుందో… మ్యాప్‌లో చూద్దాం’… ఇవన్నీ మనం వింటున్న, అంటున్న మాటలే. ఈ మాటలన్నింటిలో కామన్‌గా ఉన్నది లొకేషన్ అంటే జీపీఎస్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్… చిన్న స్మార్ట్‌ఫోన్ నుంచి పెద్ద పెద్ద క్షిపణుల వరకూ అన్ని ఈ జీపీఎస్ ఆధారంగానే పనిచేస్తాయి. అమెరికా వారికి సొంతమైన ఈ జీపీఎస్‌ను ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉపయోగిస్తోంది. చైనా వాళ్లకు బైదూ, రష్యా వారికి గ్లోనస్, భారతీయులకు త్వరలో రానున్న గగన్‌లు ఉన్నప్పటికీ ఇవన్నీ ఒకే టెక్నాలజీతో పనిచేస్తాయి. కాబట్టి ఇవి పనిచేయకపోతే ఎంత నష్టం జరుగుతుందో తెలుసా?
జీపీఎస్ శాటిలైట్‌లు ఐదు రోజులు పనిచేయకపోతే యునైటెడ్ కింగ్‌డమ్ దేశానికి 6.5 బిలియన్ డాలర్లు నష్టం వస్తుందని, ఒక్కరోజు పని చేయకపోతే అమెరికాకు 1 బిలియన్ డాలర్ల నష్టం వస్తుందని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సర్వేలో తేలింది. జీపీఎస్ శాటిలైట్ జామింగ్ చేయడం ద్వారా ఈ శాటిలైట్‌లను తాత్కాలికంగా పనిచేయకుండా చేయవచ్చు. మిలటరీ అవసరాల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం, జీపీఎస్ వ్యవస్థను కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా నిలిపివేస్తుంటుంది. అయితే, టెక్నాలజీతోపాటు హ్యాకింగ్ కూడా పెరిగింది కాబట్టి, జీపీఎస్‌ను హ్యాక్ చేయగల జామర్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. కాబట్టి జీపీఎస్‌ను హ్యాక్ చేసి ఖరీదైన కార్లను దొంగిలిస్తున్నవారు కూడా ఉన్నారు. అంతేగాకుండా జీపీఎస్ టెక్నాలజీ కంట్రోల్ తీవ్రవాదుల చేతికి వెళ్తే జరిగే ప్రమాదాలను ఊహించుకుంటేనే భయం కలుగుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా?
ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించేందుకు జీపీఎస్‌కు ముందు కొన్ని పద్ధతులు వచ్చాయి. ఉదాహరణకు లాంగ్ రేంజ్ నావిగేషన్ (లోరన్). రెండో ప్రపంచయుద్ధం సమయంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఓడలను నావిగేట్ చేయడానికి ఈ పద్ధతిని మొదటిసారిగా ఉపయోగించారు. భూమ్మీద ఉన్న సెన్సార్లను బట్టి 200 మీటర్ల పరిధిలో రేడియో నావిగేషన్ సిగ్నళ్ల ద్వారా లోరన్ దారి చూపించగలుగుతుంది. డిఫరెన్షియల్ కరెక్షన్ ఆధారంగా పనిచేసే ఈ లోరన్ ఇప్పుడు మరింత కచ్చితత్వంతో అందుబాటులోకి వచ్చింది. జీపీఎస్‌తో పోల్చితే దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దీని సిగ్నళ్లు బిల్డింగ్, టన్నెల్‌ల గుండా కూడా ప్రయాణించగలవు. అలాగే లోరన్ సిగ్నళ్లను జామ్ చేయడం చాలా కష్టం.
లోరన్ కాకుండా మరో టెక్నాలజీని కూడా జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. దాని పేరు స్కైమార్క్. అమెరికాకు చెందిన డ్రేపర్ ల్యాబోరేటరీ దీన్ని తయారు చేసింది. నక్షత్రాల స్థానాల ఆధారంగా పనిచేసే చిన్న ఆటోమేటెడ్ టెలీస్కోప్‌ల ద్వారా ఇది పనిచేస్తుంది. అయితే, ఇది నెమ్మదిగా కదిలే వస్తువుల స్థానాన్ని మాత్రమే కచ్చితంగా గుర్తించగలుగుతుంది. మరికొన్ని టెలీస్కోప్‌లు పెట్టి, కొద్దిగా ప్రోగ్రామ్ చేస్తే జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని డ్రేపర్ సీఈవో బెంజమిన్ లేన్ తెలిపారు. జీపీఎస్ సరిగా పనిచేయని సమయాల్లో కార్లలో ఉపయోగించే ఇనర్షియల్ నావిగేషన్‌ను కూడా బాగా అభివృద్ధి చేసి, జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. కానీ, దీన్ని వాడుకోవాలంటే సంబంధిత ప్రదేశానికి సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలిసి ఉండాలి. చిన్న చిన్న లొకేషన్‌ల కోసం ఇప్పటికే అమెరికా ఎయిర్‌ఫోర్స్ వారు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇమేజ్‌నావ్ అనే నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే..ఈ సిస్టమ్‌ను తరచుగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఇలా ఎన్ని రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నా జీపీఎస్‌కు సాటి రావు అనేది నమ్మకతప్పని వాస్తవం. అందుకే జీపీఎస్‌ను ఉపయోగించుకుని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, డ్రోన్లు అభివృద్ధి చేస్తున్నపుడు, ఒకవేళ జీపీఎస్ లేకపోతే ఎలా పనిచేయాలనే ప్రోగ్రామ్‌ను కూడా వాటిలో ఇన్‌స్టాల్ చేయాలని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే రేపు ఎప్పుడైనా హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లు హ్యాకర్లు తిరగబడితే, ప్రపంచం మొత్తం వారికి బానిసగా మారడం కంటే వారిని ఎదుర్కోగల ప్రమాణాలను ముందే సిద్ధం చేసుకుంటే మంచిదని వారి అభిప్రాయం.