ఆ ఆరోపణలు నిరాధారం.. మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయడు : శరద్ పవార్
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట రాజకీయాల్లో సంచలనాలను తెరలేపిన ముంబయి మాజీ పోలీసు కమిషనర్ లేఖలో పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ఆయన హోంమంత్రిని కలిసినట్టు చెబుతున్న సమయానికి అనిల్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పవార్ చెప్పారు. ఢిల్లీలోని తన నివాసంలో మహా వికాస్ అగాఢీ కూటమి నేతలతో సమావేశం ముగిసిన అనంతరం పవార్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘మీరు ఆ లెటర్‌ను పరిశీలిస్తే.. పరంబీర్ […]
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట రాజకీయాల్లో సంచలనాలను తెరలేపిన ముంబయి మాజీ పోలీసు కమిషనర్ లేఖలో పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ఆయన హోంమంత్రిని కలిసినట్టు చెబుతున్న సమయానికి అనిల్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పవార్ చెప్పారు. ఢిల్లీలోని తన నివాసంలో మహా వికాస్ అగాఢీ కూటమి నేతలతో సమావేశం ముగిసిన అనంతరం పవార్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘మీరు ఆ లెటర్‌ను పరిశీలిస్తే.. పరంబీర్ సింగ్ ఫిబ్రవరి మాసం మధ్యలో అనిల్‌ను కలిసినట్టుగా ఆరోపించారు. కానీ ఆ సమయానికి అనిల్ ఆస్పత్రిలో ఉన్నారు. కరోనా రావడంతో ఫిబ్రవరి 5 నుంచి 15 దాకా హాస్పిటల్‌లో చికిత్స పొందాడు’ అని అన్నారు. దీనిని బట్టి పరంబీర్ చేసిన ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.
అంబానీ ఇంటి ముందు బాంబు కేసును పక్కదారి పట్టించేందుకే ఈ ఆరోపణలు చేశారని పవార్ చెప్పారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి వస్తున్నాయని.. ఆమేరకు ముంబయి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తును వేగవంతం చేసిందని తెలిపారు. ఈ దర్యాప్తును దారి మళ్లించడానికే ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. అనిల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆరోపణల నేపథ్యంలో కూటమిలోని శివసేన, కాంగ్రెస్‌లు హోంమంత్రి రాజీనామా కోరాయని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని పవార్ కొట్టిపారేశారు.
పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలు పార్లమెంటు ఉభయసభల్లోనూ గందరగోళం సృష్టించాయి. దీనిపై చర్చ జరగాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీలు ఇదే అంశంపై చర్చ చేయాలని డిమాండ్ చేశాయి. లోక్‌సభలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఎంపీలు మండిపడ్డారు. ఇరు పక్షాల సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో రాజ్యసభ కొద్దిసేపు వాయిదా పడింది.