ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి : Sajjala Ramakrishna Reddy

రాష్ట్రంలో మరో 15 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Update: 2023-01-26 09:09 GMT
ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి : Sajjala Ramakrishna Reddy
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మరో 15 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పొత్తులపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఒక్కొక్కరు వచ్చినా.. కలిసి వచ్చినా పర్వాలేదు. వైసీపీని ఓడించే సీన్ మీకసలే లేదు. అన్ని పార్టీలు కలిసి వస్తాయా? ఎలా వచ్చినా వైసీపీకీ వచ్చిన నష్టం ఏమీ లేదు' అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండు వేర్వేరు కాదని రెండూ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రిమోట్ నొక్కినప్పుడల్లా పవన్ కల్యాణ్ మాట్లాడుతారని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ రోల్ ఏంటి.. చంద్రబాబు సత్తా ఏంటి అనేది ప్రజలకు తెలుసునంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

పవన్ దుష్ప్రచారం సరికాదు..

జనసేన అధినతే పవన్ కల్యాణ్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గెస్ట్ ఆర్టిస్ట్‌లా వచ్చి పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ కల్యాణ్ వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ నాలుగో ఆప్షన్‌గా చంద్రబాబుకు మద్దతు అని చెప్పాల్సి ఉండిందంటూ సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. నిధులు దుర్వినియోగం అయ్యాయని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. అందుకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని అంతేకానీ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదని పవన్ కల్యాణ్‌ను హెచ్చరించారు.

ఇంతకూ ఎవరు సీఎం?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే పోటీ చేస్తారని సజ్జల అన్నారు. అయితే ఇద్దరిలో ఎవరు సీఎం అభ్యర్థి చెప్పి ఎన్నికలకు వెళ్లగలరా? అని సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పొత్తుకు వెళుతున్నారో లేకపోతే ఏ ఉద్దేశంతో వెళ్తున్నారో పవన్ కల్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ పొత్తుల పై పవన్ ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. మరోవైపు నారా లోకేశ్ పాదయాత్ర చేయడానికి వాళ్ల నాన్నను ముఖ్యమంత్రిగా చేయమని కోరతారా ? అని ప్రశ్నించారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆంక్షలున్నాయని.. లోకేశ్ పాదయాత్రకు మాత్రమే కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: MLA Nandamuri Balakrishna సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyanపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News