ఏపీలో వైసీపీ బస్సు యాత్ర షురూ... ఉత్తరాంధ్ర నుంచే శ్రీకారం
రాబోయే ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : రాబోయే ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందాలని పక్కా వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతీ ఎమ్మెల్యేను ప్రజల్లో ఉంచేలా సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్లాన్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ బస్సుయాత్రను తొలిసారి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం విశాఖలో ఉత్తరాంధ్ర మంత్రులు, జిల్లా అధ్యక్షులతో రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. సామాజిక బస్సు యాత్రకు సంబంధించి షెడ్యూల్, రూట్ మ్యాప్ ఖరారుపై వాడివేడిగా చర్చించారు. అనంతరం బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు చేశారు. 13 రోజులపాటు తొలివిడతగా ఉత్తరాంధ్రలో ఈ సామాజిక బస్సు యాత్ర నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది.
ఉత్తరాంధ్ర నుంచే ఆరంభం
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే రెండు నెలల పాటు వైసీపీ శ్రేణులు ప్రజల్లో ఉండేలా సామాజిక బస్సు యాత్రకు వైసీపీ సన్నద్ధం అయ్యింది. ఈనెల 26 నుంచి నవంబర్ 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర నిర్వహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ సామాజిక బస్సు యాత్రలో ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యే, పార్టీ ఇన్ ఛార్జ్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు పాల్గొనాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ బస్సుయాత్రలో ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ నేతలు ఈ నాలుగన్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉత్తరాంధ్ర వైసీపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్‌తోపాటు జిల్లాల అధ్యక్షులు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
షెడ్యూల్ ఇదే
అనంతరం సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వివరించారు. ఈనెల 26 నుంచి 9 వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు ఉత్తరాంధ్రలో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈనెల 26న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, 27న విజయనగరం జిల్లా గజపతినగరం, 28న విశాఖ భీమిలిలో సామాజిక బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే 30న పాడేరులో 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఈ సామాజిక బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. నవంబర్ 1న పార్వతీపురం, 2న విశాఖ జిల్లా మాడుగుల, 3న నరసన్నపేట,4 ఎస్ కోట, 6 గాజువాక, 7 రాజాం, 8 సాలూరు,9 అనకాపల్లిలో ఈ సామాజిక బస్సు యాత్ర కొనసాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ రాష్ట్రానికి జగన్ నాయకత్వం ఎంత అవసరమో ఈ సామాజిక బస్సు యాత్ర ద్వారా తెలియజేయనున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో సామాజికంగా, ఆర్థికంగా ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందారో వివరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.