మళ్లీ గ్లాసు గుర్తు ఎందుకు... సైకిలే తీసుకుంటే పోలా!:జనసేన సింబల్‌పై మంత్రి అంబటి సెటైర్లు

జనసేన పార్టీపై విరుచుకుపడే వారిలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు.

Update: 2023-09-20 05:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీపై విరుచుకుపడే వారిలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు. జనసేన నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా... పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ట్విటర్ వేదికగానూ.. ప్రెస్‌మీట్ వేదికగానో మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడతారన్న విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గాజు గ్లాస్ సింబల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గాజు గ్లాసు గుర్తును మరోసారి జనసేన పార్టీకే కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సిఈసీ నిర్ణయంపై జనసేన హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ ప్రెస్‌నోట్ సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా స్పందించారు.‘మళ్లీ గ్లాసు గుర్తు ఎందుకు... సైకిలే తీసుకుంటే పోలా!’ అంటూ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టారు. ఇటీవలే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వేదికగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికలకు వెళ్తాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ-జనసేనల మధ్య పొత్తు కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిదే. ఈ అంశాన్ని టార్గెట్ చేస్తూ జనసేన సింబల్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

Tags:    

Similar News