మా నాన్న హత్యలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది.. ఎవరిని వదిలిపెట్టా: వైఎస్ సునీతారెడ్డి
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన తనయ వైఎస్ సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో కుటుంబ సభ్యుల పాత్ర సైతం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన తనయ వైఎస్ సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో కుటుంబ సభ్యుల పాత్ర సైతం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య విషయంలో కుటుంబ సభ్యుల పై ఆరోపణలు చేస్తున్న విషయం తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. హత్య కేసులో వారి ప్రమేయం ఉందని నమ్ముతున్నందునే సీబీఐకి అన్ని విషయాలు తెలియజేసినట్లు చెప్పుకొచ్చారు.
వైఎస్ వివేకానందరెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ సునీతారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రిని తలచుకుని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
నిజం తెలియాల్సిందే
కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. ఈ హత్య కేసులో తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్స్ రూపంలో అందజేసినట్టు స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో విశ్లేషించి సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్ వివేకా హత్యపై గతంలో కొందరు తేలికగా మాట్లాడారు అని గుర్తు చేశారు.
కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారని గుర్తు చేసుకున్నారు. ఎందుకు అంతలా ఆరాటపడుతున్నారు అని మరికొంతమంది అన్నారని గుర్తు చేశారు. ఒకరిమీద కక్ష్యతో చేసేది కాదు నిజం తెలియాలి.. నిజం అందరికీ తెలియాలి అని వైఎస్ సునీతా రెడ్డి అన్నారు. నాన్నను ఎవరు హత్యచేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతా అని గట్టిగా మాట్లాడారు.
30 ఏళ్ల క్రితం గొడవలు మళ్లీ మొదలవుతున్నాయని అనిపిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలి అని డిమాండ్ చేశారు. ఈ హత్యకేసు విచారణ సందర్భంగా ఎవరైనా మాట్లాడటం సరికాదని చెప్పుకొచ్చారు. దర్యాప్తు సంస్థలు, పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అంతా సహకరించాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఎంతోమంది తెలియకుండానే సహకరిస్తున్నారని వారందరికీ వైఎస్ సునీత కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి నివాళులర్పించిన వారిలో అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రతాప్ రెడ్డి, శివ ప్రకాష్ రెడ్డి బంధుమిత్రులు, సానుభూతిపరులు ఉన్నారు.