రాష్ట్రానికి జగనోరా వైరస్ పట్టింది: Nara lokesh
రాష్ట్రానికి జగనోరా వైరస్ పట్టిందని, ఆక్వా రంగం పూర్తిగా కుదేలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు...
దిశ, ఉభయ గోదావరి ప్రతినిథి: రాష్ట్రానికి జగనోరా వైరస్ పట్టిందని, ఆక్వా రంగం పూర్తిగా కుదేలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగాన్ని ఇబ్బంది పాలు చేస్తున్న వైట్ స్పాట్ కన్నా జగన్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయన విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆక్వా రైతులతో లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ పాలనలో ఆక్వా రంగం పూర్తిగా భ్రష్టు పట్టిందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఆక్వా దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని లోకేష్ గుర్తు చేశారు.
ప్రస్తుతం ఆ రంగం చాలా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిందని లోకేష్ మండిపడ్డారు. దీనికంతటికీ కారణం జగన్ పరిపాలనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆక్వా రంగంలో సుమారుగా పది లక్షల మంది ఉపాధి పొందేవారని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారంతా అప్పుల్లో కూరుకు పోతున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ సబ్సిడీలు కూడా ఎత్తిపారేశారన్నారు. అమ్మకాలు కూడా తగ్గిపోవడానికి జగన్ పాలనే కారణమని ఆరోపించారు. పంట అధికంగా పండితే సిండికేట్ మాదిరిగా ముఠాను సృష్టించి ధరలు పతనమయ్యేలా చేస్తున్నారని నారా లోకోష్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 24 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ రూ.1.50 పైలకే అందిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.