Ap News: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ .. 26తో దరఖాస్తు చివరి డేట్

నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఆరు సంవత్సరాల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.

Update: 2023-06-04 14:07 GMT

దిశ, ఏలూరు ప్రతినిధి: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఆరు సంవత్సరాల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఒక్కో సెంటర్‌లో వెయ్యి సీట్లను భర్తీ చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు మరో 100 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 సాయంత్రం 5 గంటల్లోగా ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని వర్సిటీ సూచించింది.

అభ్యర్థులు 2023లో తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 31-12-2028 నాటికి 18 ఏళ్లు నిండకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే 21 ఏళ్లు దాటకూడదు. అభ్యర్థులు ఏపీ ఆన్ లైన్ సెంటర్ ద్వారా ఆర్జీయూకేటీ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. ఏపీ ఆన్ లైన్ సెంటర్లలో ఇచ్చే రసీదును భద్రపరుచుకోవాలి. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలోనే ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ స్కూళ్లు, జిల్లా పరిషత్ హైస్కూళ్లు, మున్సిపల్ హైస్కూళ్లలో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు 4 శాతం డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయిటేజీగా పేర్కొన్నారు.

85 శాతం సీట్లను స్థానికంగాను, 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. అలాగే ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఏకు 7 శాతం, బీసీ - బీకి 10 శాతం, బీసీ-సీకి 1 శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తారు. ప్రత్యేక సీట్లు కింద వికలాంగులకు 5 శాతం, సైనిక ఉద్యోగుల పిల్లలకు 2, సీసీ విద్యార్థులకు 1 స్పోర్ట్స్ శాతం, ఎన్ కోటా కింద 0.5 శాతం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి కేటగిరీలోనూ 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.

గ్రేడ్ పాయింట్లు సమానమైతే ఎంపిక ఇలా

దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో సంబంధిత కేటగిరీలో ఏ ఇద్దరి విద్యార్థుల మార్కులు సమానమైనా.. గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులలో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ కూడా సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. అలాగే పుట్టిన తేదీ ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్ టికెట్ నంబర్ ఆధారం‌గా ఎంపిక చేస్తారు. దరఖాస్తులో అడ్రస్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలని వర్సిటీ అధికారులు తెలిపారు.. 

Tags:    

Similar News