Visakha: తెలుగు భాషాభివృద్దికి త్వరలో వెబ్‌సైట్
తెలుగు అభివృద్ధికి ఉత్తరాంధ్ర కవులు, పండితులు భాషాభిమానులు కృషి చేశారని ఏపీ అధికార భాష సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి. విజయబాబు అన్నారు.
దిశ, విశాఖపట్నం: తెలుగు సాహిత్యానికి ఉత్తరాంధ్ర పుట్టినిల్లువంటిదని, ఇక్కడి నుంచి ఎంతో మంది కవులు, పండితులు భాషాభిమానులు తెలుగు అభివృద్ధికి కృషి చేశారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. విశాఖ ప్రభుత్వ అతిధి గృహంలో పత్రికా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషాభివృద్దికి కృషి చేసిన మహానుభావులు ఉత్తరాంధ్రలో ఎంతో మంది ఉన్నారని తెలిపారు. త్వరలో కవులు, పండితులు భాషాభిమానులతో ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్య సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు అధికార భాషకు ఇప్పటివరకు ఎటువంటి వెబ్ సైట్ లేదని, దానిని రూపొందించుటకు తన వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. పత్రికా ప్రతినిధులు రాజకీయాలను అతీతంగా తెలుగు భాషాభివృద్దికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. త్వరలో తిరుపతిలో ఆత్యాద్మిక భాషోత్సవాలు , పల్నాడులో దళిత సాహిత్య ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కోర్టు తీర్పులు తెలుగులో ఉండేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నేడు తాపీ ధర్మారావు జయంతి, రేపు గురజాడ జయంతి సందర్భంగా జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గురజాడ నుంచి వంగపండు వరకు అనేక మంది భాషాభిమనులు, కవులు, పండితులు తెలుగు భాషాభివృద్దికి ఎంతో కృషి చేశారని, జానపద కథాసాహిత్యంపై సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా తెలుగు భాషకు సేవ చేస్తున్న వారికి సత్యరించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు లేని చిన్నయ్యసూరి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసామని పి. విజయబాబు తెలిపారు.