Visakha: కదంతొక్కిన పాత్రికేయులు.. 9 డిమాండ్లతో ఆందోళన
జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విశాఖలో పాత్రికేయులు కదంతొక్కారు....
దిశ, ఉత్తరాంధ్ర: జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విశాఖలో పాత్రికేయులు కదంతొక్కారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ పిలుపు మేరకు విశాఖ జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ అధ్యక్షుడు పి.నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్38లో మార్పులు చేసి అర్హులైన వారందరకీ అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులకు ఫెన్షన్ సదుపాయం మంజూరు చేయాలని, ప్రమాదబీమా కార్డులు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు అటాక్స్ కమిటీలు పునరుద్దరించాలని, కార్మిక బీమా వర్తింపజేయాలన్నారు. జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు చేయాలని, అన్నీ కమిటీల్లో ఏబీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏకు ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలని, జర్నలిస్టుల ఆరోగ్య బీమా అమలుపై సమీక్షకు కమిటీని నియమించాలన్నారు. ఆయా అంశాలపై తన పరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించి మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపినట్లు శ్రీనుబాబు, పి.నారాయణ్ పేర్కొన్నారు.