Visakha: రాష్ట్రంలో 11 మంది మున్సిపల్ కమిషనర్లకు పదోన్నతి

ఏపీలో 11 మంది మున్సిపల్ క‌మిష‌న‌ర్ల‌కు ప‌దోన్న‌తి ల‌భించింది..

Update: 2023-09-28 14:34 GMT

దిశ, విశాఖపట్నం: ఏపీలో 11 మంది మున్సిపల్ క‌మిష‌న‌ర్ల‌కు ప‌దోన్న‌తి ల‌భించింది. జీవీఎంసీలో ముగ్గురికి చాన్స్ ద‌క్కింది. పురపాలకశాఖలో పని చేస్తున్న ఐదుగురు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లను సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేర‌కు జీఓఆర్టి నంబర్ 661ను ప్ర‌భుత్వం జారీ చేసింది. అలాగే ఆరుగురు ఫస్ట్ గ్రేడ్ మున్సిపల్ కమిషర్లను, స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో విశాఖ నగరపాలక సంస్థలో పని చేస్తున్న ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు పదోన్నతి పొందారు. అందులో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదాలో కార్యదర్శిగా పని చేస్తున్న పల్లి నల్లనయ్య సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు.

కాగా గ్రేటర్ కార్యదర్శి పోస్ట్‌లోనే కొనసాగిస్తూ ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఫస్ట్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదాలో జోనల్ కమిషనర్‌గా పని చేస్తున్న బొడ్డేపల్లి రాముడు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ తిరిగి అదే స్థానంలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫస్ట్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ హోదాలో డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సీహెచ్ సత్యనారాయణను స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ తిరిగి అదే స్థానంలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


Similar News