Vijayasai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా.. సెన్సేషనల్ కామెంట్స్
వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు చైర్మన్ జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankar)ను కలిసి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని అందజేశారు. అసంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పూర్తిగా తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని అన్నారు. తన రాజీనామాను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankar) కూడా ఆమోదించారని పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడైన వైఎస్ జగన్ (YS Jagan)తో తాను ఫోన్ మాట్లాడానని అన్నారు. ఆయన అన్ని మాట్లాడాకే స్పీకర్‌కు తన రాజీనామాను అందజేశానని తెలిపారు. త్వరలోనే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. తాను ఏ రోజూ అబద్ధాలు చెప్పలేదని.. హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా అబద్ధాలు ఒక మీదట కూడా చెప్పబోనని కామెంట్ చేశారు.
గత నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలతో వైస్ ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఆ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. ఇర మీదట రావని స్పష్టం చేశారు. 2011 ఆగస్ట్‌లో తనపై కేసులు నమోదయ్యాయని.. అప్రూవర్‌గా మారమని అప్పుడు ఎన్నో రకాలుగా బెదిరించనా తాను మారలేదని అన్నారు. అప్పుడున్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయని పేర్కొన్నారు. కాకినాడ పోర్టు కేసు (Kakinada Port Case) విషయంలో కేవీ రావు (KV Rao)తో తనకు ఎలాంటి పరిచయం, ఎలాంటి లవాదేవీలు లేవని అన్నారు. విక్రాంత్ రెడ్డిని, కేవీ రావు దగ్గరకు తానే పంపానని అనడం పూర్తిగా అవాస్తవమని తెలిపారు.
కాకినాడ పోర్టు కేసు (Kakinada Port Case)లో తనకు A2గా చేర్చారని.. కానీ ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తన పిల్లల సాక్షిగా ప్రమాణం చేస్తానని అన్నారు. అదేవిధంగా తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ఏ సంస్థలోనూ భాగస్వామ్యాలు లేవని అన్నారు. ఓ కార్యకర్తగా నిరంతరం వైఎస్ఆర్‌సీపీ పార్టీ (YSRCP Party) కోసమే పని చేశానని తెలిపారు. తన మీద ఎలాంటి ఒత్తిడి లేదని.. ఎవరి ప్రభావం ఉండదని అన్నారు. ఎవరితోనే కేసులు మాఫీ చేయించుకోవాల్సిన అవసరం కూడా తనకు ఉండదని తెలిపారు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటానని.. భయపడే తత్వం తన రక్తంలోనే లేదని మాజీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.