జైలులో ఖైదీ ఆత్మహత్య... ఇద్దరు వార్డర్ల సస్సెన్షన్‌

ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇద్దరు వార్డర్లపై సస్పెన్షన్ వేటు పడింది...

Update: 2025-03-31 14:37 GMT
జైలులో ఖైదీ ఆత్మహత్య... ఇద్దరు వార్డర్ల సస్సెన్షన్‌
  • whatsapp icon

దిశ ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మహిళా ఖైదీ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన ఘటనకు సంబంధించి మ‌హిళా బ్యార‌క్‌లో విధులు నిర్వ‌హిస్తోన్న హెడ్ వార్డెన్‌ ఎల్‌.వ‌ర‌ల‌క్ష్మి , వార్డెన్‌ నాగ‌మ‌ణి ‌ల‌ను సోమవారం సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్ల‌క్ష్యంగా ఉన్నార‌నే అభియోగంపై వారిద్ద‌రినీ సస్పెండ్ చేస్తూ జైలు సూప‌రింటెండెంట్ సీహెచ్ఆర్‌వీ స్వామి ఆదేశాలు ఇచ్చారు. భర్త గంధం బోస్‌ను హత్య చేశారనే అభియోగంపై గంధం శాంతకుమారి, ఆమె మేనమామ గోపాలరావులను జీలుగుమిల్లి పోలీసులు మార్చి 24న అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరు పర్చగా రిమాండ్‌ విధించారు. భర్త హత్యకు గురైన వారంలోపే శాంత కుమారి మహిళా బ్యారక్స్‌లో ఆదివారం చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు

అయితే శాంతకుమారితో పాటు మరో ఆరుగురు ఖైదీలు మ‌హిళా బ్యారక్‌లో ఉంటున్నారు. ఆదివారం ఉద‌యం 6 గంట‌ల‌కు బ్యార‌క్ ఓపెన్ చేయగా శాంత‌కుమారి బాత్ రూంకు వెళ్లి వ‌స్తాన‌ని మిగిలిన ఖైదీల‌కు చెప్పి వెళ్లింది. ఉద‌యం టిఫిన్ చేయడానికి ఎంత సేప‌టికి రాక‌పోవ‌డంతో తోటీ ఖైదీలు వెళ్లి చూస్తే బ్యార‌క్ కిటికీకి చున్నీతో ఉరేసుకుని క‌నిపించింది. వెంట‌నే జైలు సిబ్బందికి స‌మాచారం అందించారు. అనంతరం ఆమెను ఏలూరులోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రీక్షించి అప్ప‌టికే ఆమె మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు. జైలు సూప‌రింటెండెంట్ సీహెచ్ఆర్‌వీ స్వామి, ఏలూరు ఒక‌టో ప‌ట్ట‌ణ సీఐ స‌త్య‌నారాయ‌ణ ఆసుప‌త్రికి చేరుకుని మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. జైలు అధికారుల ఫిర్యాదు మేర‌కు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని జైలు అధికారులు తెలిపారు.

మరోవైపు ఈ సమాచారం తెలిసి బంధువులు ఏలూరు ఆసుప‌త్రికి చేరుకున్నారు. కుటుంబ స‌భ్యులు, పోలీసులు, జైలు అధికారుల స‌మ‌క్షంలో ఆర్డీవో అచ్యుత్ అంబ‌రీశ్ మృత‌దేహానికి ఆసుప‌త్రి మార్చురీలో పంచ‌నామా నిర్వ‌హించారు. త‌మ కుమార్తెను ఈ కేసులో ఇరికించార‌ని మృతురాలి త‌ల్లి బ‌త్తుల కుమారి ఆరోపించారు. పోలీసుల బెదిరించార‌ని, ఒత్తిడి చేశార‌ని, అందుకే నేరం చేసిన‌ట్లు అంగీక‌రించింద‌ని ఆరోపించింది. ఇప్పుడు త‌మ కుమార్తె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఇద్ద‌రు పిల్ల‌లు అనాథ‌ల‌య్యార‌ని క‌న్నీరుమున్నీరయ్యారు.

కాగా, చున్నీతో బాత్‌రూమ్‌కిటికీకి ఉరి వేసుకుని శాంతకుమారి ఆత్మహత్య చేసుకుందనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రెస్‌ కోడ్‌లో మహిళా ఖైదీలకు చున్నీ ఉంటుందా.. కిటికీ ఎత్తు ఎంత ఉంటుందీ , ఏ విధంగా ఉరి వేసుకోవడం సాధ్యపడుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యారక్‌లో శాంతకుమారి ఆత్మహత్యకు దారితీసే విధంగా ఏమైనా జరిగిందా అనే అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు. ఏదేమైనా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. 

Similar News