ఆ విషయంలో వెనక్కి తగ్గని జగన్​.. వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అలజడి

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో అలజడి కొనసాగుతోంది...

Update: 2023-12-19 03:23 GMT

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో అలజడి కొనసాగుతోంది. అయినా నియోజకవర్గాల మార్పునకు సంబంధించి సీఎం జగన్​వెనకడుగు వేయదల్చుకోలేదు. సోమవారం మరో ఐదుగురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపొచ్చింది. దీంతో నియోజకవర్గాల మార్పునకు సంబంధించి మరో జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు మొహం మాడ్చుకుంటున్నా.. వాళ్ల అనుచరులు కారాలు మిరియాలు నూరుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరమే మేలన్నట్లు వ్యవహరిస్తున్నారు. బీ ఫారం ఇచ్చేదాకా టెన్షన్ పెట్టకుండా ముందుగానే తేల్చి చెప్పడం వల్ల పార్టీకి, నేతలకు మంచిదేనంటూ వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల నుంచి సీఎం జగన్ పలువురు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలను పిలిపించి మాట్లాడుతున్నారు. సోమవారం సీఎంతో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో వివిధ సామాజిక వర్గాల మధ్య సమన్వయం, అభ్యర్థి మార్పు గురించి ముందుగానే చెప్పేస్తున్నారు. పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ నేతలకు గౌరవ ప్రదమైన పదవులు ఇస్తామని హామీనిస్తున్నారు. ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతను తొలుత ప్రాంతీయ సమన్వయకర్తలకు అప్పగించారు. వాళ్ల కన్నా తానే చెబితే గట్టిగా నమ్ముతారని సీఎం భావించి ఉండొచ్చు. అందుకే ప్రతీ రోజు కొందరు నేతలను పిలిచి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా చేసిన కసరత్తుతో రెండో విడత మార్పులకు సంబంధించిన జాబితా సిద్ధమైనట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

మలి విడత జాబితాలో.. కొందరు మంత్రుల పేర్లు

మలి విడత జాబితాలో కొందరు మంత్రుల పేర్లున్నట్లు సమాచారం. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి నుంచి యలమంచిలికి పంపుతారని తెలుస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరి జయరాం స్థానాన్ని మార్చడం లేదా లోక్‌సభకు పంపే అవకాశముంది. హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి పంపే యోచనలో ఉన్నారు. మంత్రి పినిపె విశ్వరూప్‌ను అమలాపురం నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ స్థానంలో ఎంపీ చింతా అనురాధను బరిలోకి దించే అవకాశాలున్నాయి. మంత్రులు జోగి రమేశ్‌ను పెడన నుంచి, అంబటి రాంబాబును సత్తెనపల్లి నుంచి ఇతర నియోజకవర్గాలకు పంపొచ్చని పార్టీ వర్గాల సమాచారం. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీ వంగా గీతకు ఇవ్వొచ్చని తెలుస్తోంది. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను లోక్‌సభకు పంపొచ్చని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. వీళ్లుగాక మరో 19 మంది స్థానాల మార్పు మీద కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

అసంతృప్తులకు ప్రత్యామ్నాయం

ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉంది. ఈ లోగా నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్పుతో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించుకోవడానికి సాధ్యపడుతుంది. ఇష్టమున్నవాళ్లు ఉంటారు. సీటు లేకున్నా పార్టీలో కొనసాగడానికి ఇష్టపడనివాళ్లు ప్రత్యామ్నాయం చూసుకోవడానికి దోహదపడుతుంది. బీ ఫారం ఇచ్చేదాకా సీటు దక్కుతుందో.. గల్లంతవుతుందోనన్న టెన్షన్‌లో ఎవరూ సక్రమంగా పని చేయలేకపోవచ్చు. సీఎం జగన్ తీసుకున్న నియోజకవర్గాల మార్పు నిర్ణయం పట్ల పార్టీ శ్రేణులు సానుకూలంగానే ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News