విద్యార్థులకు గుడ్ న్యూస్.. సిఫార్సులు లేకుండానే ప్రవేశాలు
విద్యార్థులకు టీటీడీ తీపి కబురు తెలిపింది...
దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులకు టీటీడీ తీపి కబురు తెలిపింది. టీటీడీ, విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఇక సిఫార్సులు లేఖలు అవసరం లేదు. ఆ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తాజాగా ఎత్తివేసింది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం పాలక మండలి సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. టీడీడీ అధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులకు సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పనకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు.
అలాగే విద్యార్థుల సౌకర్యార్ధం మరిన్ని నూతన హాస్టల్ భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు హాస్టళ్లలో స్టడీ రూములు, రిక్రియేషన్ హాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి పూర్తి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఇకపై టీటీడీ కాలేజీల్లోనూ సిఫార్సులతో సంబంధం లేకుండా విద్యార్థులకు ప్రవేశం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.