ఇంత విష ప్రచారం అవసరమా నాయనా..?.. ఇకనైనా మారండి..!
రాష్ట్ర అభివృద్ధిపై కొందరు విషప్రచారం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకూ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన జగన్ సర్కార్‌ను ప్రజలు ఇంటికి పంపి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఘోర అవమానం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇప్పుడు రాష్ట్రంపై విషం చిమ్ముతుందనే అభిప్రాయం జనాల్లో ఏర్పడుతుంది. ఓటమిని అంగీకరించి తప్పు తెలుసుకుంటారని అంతా భావించినా తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు. పైకి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెబుతూనే మళ్లీ దుష్ప్రచారం మొదలుపెట్టారనే ప్రచారం ఊపందుకుంది.

ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ పని చేస్తున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లి పలు కంపెనీలను కలిసి పెట్టుబడులకు ఆహ్వానించారు. దీంతో పలు కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆయా కంపనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ సంస్థలను తిరిగి రాష్ట్రానికి రప్పించేలా ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటిస్తోంది.

అయితే ఐటీ నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖ రాజధాని అంటూ గత ప్రభుత్వం ఆడిన నాటాలను కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపిస్తూనే.. తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంటోంది. ఇందులో భాగంగా టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలను ఆహ్వానించింది. కాపులఉప్పాడలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఎకరానికి రూ. 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెం.3లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరానికి రూ. 1 కోటి చొప్పున 3.5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉద్యోగాల సృష్టికి 2 సంవత్సరాల గడువు కూడా ఇచ్చింది.

దీంతో వైసీపీ నాయకులు రగిలిపోతున్నారు. గతంలో విశాఖకు ఒక్క కంపెనీని కూడా తీసుకురాకుండా రాజధాని పేరుతో రుషికొండ బీచ్‌కు గుండు కొట్టి మరీ ప్రజలను ఎలా మభ్య పెట్టారో అందిరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి విశాఖను అభివృద్ది చేస్తుంటే చూడలేకపోతున్నారు. ఎలాగైనా సరే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో నాయకుడు ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పట్లో పరిశ్రమలను వెళ్లగొట్టి.. ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుండటంతో అక్కసు కక్కుతున్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాజధాని, విశాఖ అభివృద్ది, ముమ్మరంగా పోలవరం ప్రాజెక్టు పనులు, సీమ ప్రజలకోసం బనకచర్ల ప్రాజెక్టు, ఆర్థిక సమస్యలున్నా నిధులు రాబట్టడం వంటివి కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైసీపీ నేతలు చూడలేకపోతున్నారు. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ప్రతినిత్యం కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. పథకాలు ఇవ్వలేకపోతున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న పథకాలపైనా విమర్శలు కురిపిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు11 సీట్లు ఇచ్చారన్న విషయం మర్చిపోయి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించామనే సోయకూడాలేకుండా, సమయం, సందర్భంగా లేకుండా ప్రభుత్వంపై విషం చిమ్మడమే పార్టీ కార్యక్రమంగా పెట్టుకున్నారని కూటమి నాయకులు అంటున్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
‘‘పెట్టుబడులు వద్దా? కంపెనీలు వద్దా ? ఉద్యోగాలు ఇవ్వొద్దా! అసలు రాష్ట్రమే బాగుపడొద్దా?! ఇదేనా వైసీపీ నేతలకు కావాల్సింది!? గతంలో ఐటీని చావుదెబ్బ కొట్టి.. ఇప్పుడు తాము కూడా అదే చేయాలా అనే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర యువతకు, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములు ఇస్తే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ తన పంథాను మార్చుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపైనా అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్ల నుంచి వ్యతిరేక వినిపిస్తోంది. ఇప్పటికైనా వైఎస్ జగన్ తన తీరు మార్చుకుని.. తన పార్టీ నాయకులను సరైన రాజకీయాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతం మాదిరి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే ఈసారి ఆ 11 కూడా కష్టమేనని అంటున్నారు. చూడాలి మరి.