Tirumala : తిరుమలలో ఘనంగా గోదా రంగనాధుల కల్యాణోత్సవం

తిరుమల(Tirumala)శ్రీవారి ఆలయంలో గోదాదేవి రంగనాధ స్వామి(Wedding of Goda Ranganatha Swami)ల పరిణయోత్సవం కన్నుల పండవగా సాగింది

Update: 2025-01-15 04:51 GMT
Tirumala : తిరుమలలో ఘనంగా గోదా రంగనాధుల కల్యాణోత్సవం
  • whatsapp icon

దిశ, వెడ్ డెస్క్ : తిరుమల(Tirumala)శ్రీవారి ఆలయంలో గోదాదేవి రంగనాధ స్వామి(Wedding of Goda Ranganatha Swami)ల పరిణయోత్సవం కన్నుల పండవగా సాగింది. టీటీడీ(TTD) పరిపాలన భవనం ప్రాంగణం మైదానంలో గోదా కల్యాణాన్ని వేద పండితులు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. భారీగా హాజరైన భక్తులు గోదాదేవి కల్యాణాన్ని కనులారా తిలకించి పులకించిపోయారు. కల్యాణోత్సవ ఘట్టంలో శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించిన తిరుమల శ్రీవారి ఆలయ అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు గోవింద నామ్మస్మరణల మధ్య శాస్త్రోక్తంగా జరిపారు. ఆ తర్వాత మహా సంకల్పం, స్వామి, అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు.

హోమము, పూర్ణాహుతి, వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం వైభవంగా సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మాడవీధులలో ప్రణయ కలహ మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు కొనసాగింది.

మరోవైపు తిరుమలలో నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం అయినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ధనుర్మాసం కారణంగా డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వ తేదీ వరకు సుప్రభాత సేవను నిలిపివేసిన టీటీడీ అధికారులు తిరిగి ప్రారంభించారు. నిన్న తిరుమల శ్రీవారిని 78.000 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 17,406 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.44 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ వరకూ ఇదే రకమైన రద్దీ కొనసాగే అవకాశముందన్నారు.

Tags:    

Similar News