మిత్రపక్షంగానే జనసేన... ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం
ఏపీలో సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక బీజేపీ కూడా ఎన్నికలకు సమాయత్తమవుతోంది. జనసేన మిత్రపక్షమని చెబుతోంది. టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ అధిష్టానమే చూసుకుంటోందని స్పష్టం చేస్తోంది.
తాజాగా విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రాజకీయ తీర్మానం చేశారు. రాష్ట్రంలో జనసేన తమకు మిత్రపక్షమని ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు. టీడీపీతో పొత్తు నిర్ణయం అధిష్టానానిదేనని చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తామంతా కట్టుబడి ఉంటామని తెలిపారు. ఏ పథకం ప్రవేశపెట్టినా ముందుగా తమకెంత వస్తోందని నాయకులు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఎదుటి వారికి న్యాయం చేయకపోయినా పర్వాలేదు గానీ, అన్యాయం చేయకూడదని పురంధేశ్వరి సూచించారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా న్యాయం చేసిందని, కానీ కేంద్రపథకాలను సీఎం జగన్ తమవిగా చెప్పుకుంటున్నారని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.