‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు

'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్' నిర్మాణంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

Update: 2024-09-29 13:17 GMT

దిశ ప్రతినిధి, ధర్మవరం: 'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్' నిర్మాణంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ధర్మవరంలో జరిగిన 22వ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్‌గా మార్చేందుకు ప్రతి వైద్యుడు కృషి చేయాలన్నారు. వైద్య సిబ్బంది సహకారంతో ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రతి వైద్యుడు వైద్య సేవలు అందించడం తమ వృత్తిగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు.

ప్రభుత్వం కూడా వైద్య సేవలు అందించడానికి, వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య సేవల అభివృద్ధి కోసం వైద్యులు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు పలు సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకురాగా వాటిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం. జయచంద్ర నాయుడు IMA రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ ఫణిధర్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, డాక్టర్ నంద కిషోర్,డాక్టర్ రవి కృష్ణ IMA AP రాష్ట్ర తక్షణ గత అధ్యక్షుడు, డాక్టర్ సి. జయకుమార్ IMA అధ్యక్షుడు ధర్మవరం, డాక్టర్ వాసుదేవ రెడ్డి, సెక్రటరీ, IMA ధర్మవరం, తదితరులు పాల్గొన్నారు.


Similar News