Ap Cabinet: కొత్త చట్టం అమలుకు గ్రీన్ సిగ్నల్.. పలు నిర్ణయాలకు ఆమోదం

ఏపీ కేబినెట్ భేటీలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..

Update: 2024-11-06 10:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరిగిన భేటీలో డ్రోన్ పాలసీ(Drone Policy)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు సెమీ కండక్టర్ పాలసీ(Semiconductor Policy)కి సైతం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ర్టంలో భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్టుకు ఆమోదం తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా భూమి దుర్వినియోగాన్ని అరికట్టే చర్యలు తీసుకోబోతున్నట్లు కేబినెట్​పేర్కొంది. దీంతో పాటు ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ 1982 రిఫిల్‌ బిల్లును కూడా కేబినెట్‌ ఆమోదించింది, దీని ద్వారా ప్రస్తుత చట్టంలో ఉన్న లోపాలను సరిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై ఇటీవల సీఎం చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ క్రమంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్టు తీసుకు వస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టంలో భూ ఆక్రమణదారులపై కేసుల నమోదుకు అవాంతరాలు ఎదురవుతుండటంతో ల్యాండ్ గ్రాబింగ్ -1982లో మార్పులు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. భూమి కబ్జాలపై10 నుంచి 15 ఏళ్లకు శిక్ష పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పలు కీలక నిర్ణయాలు..

2014-18 మధ్య కాలంలో 'నీరు-చెట్టు' పథకంలో భాగంగా పెండింగ్ బిల్లుల విడుదల, పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజవర్గం పరిధిలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం కేబినెట్​ తెలిపింది. సీఆర్డీఏ పరిధి 8,352 చదరపు కిలో మీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు , బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 154 గ్రామలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోని తీసుకురానున్నారు. రాష్ట్రంలో జ్యుడీషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024‌కు కూడా ఆమోదం ఇచ్చారు. కుప్పంలో కూడా ఏరియా డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. కుప్పం డెవలప్మెంట్ అథారిటీ నాలుగు మండలాలను మరియు ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తుంది.


Similar News