రేపటి నుంచి విక్రమ భట్టీశ్వర స్వామి కల్యాణోత్సవం
ఆలమూరులోని విక్రమ భట్టీశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
దిశ, కొత్తపేట: శతాబ్దాల చరిత్ర సంతరించుకున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని పార్వతీ సమేత విక్రమ భట్టీశ్వర స్వామి ఆలయ వార్షిక కల్యాణోత్సవాలు ఈనెల 15 నుంచి 21 వరకు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 15 రాత్రి 8 గంటలకు జరిగే స్వామివారి కల్యాణోత్సవాలకు ముందుగా స్వామివారిని నంది వాహనంపై భారీ ఊరేగింపు నిర్వహించి తదుపరి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై పార్వతి సమేత విక్రమ భక్తీశ్వర స్వామి వారి లకు కళ్యాణోత్సవం జరగనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి సూరి పండు ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీపతి భవాని వీర్రాజు తెలిపారు.
ఈనెల 18న మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగే విధంగా చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు. ఈ నెల 21న స్వామివారికి శ్రీ పుష్పోత్సవం జరుగుతుందని వారు తెలిపారు. స్వామి వారి కల్యాణోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.