Breaking: ఆస్పత్రిలో అనుకోని ఘటన... బయటకు పరుగు తీసిన రోగులు
అల్లూరు జిల్లా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో ఒక్కసారిగా అలముకున్న పొగలు రోగులను హడలెత్తించాయి..
దిశ, వెబ్ డెస్క్: ఒక్కసారిగా అలముకున్న పొగలు రోగులను హడలెత్తించాయి. ఆస్పత్రి బయటకు పరుగులు తీయించాయి. ఈ ఘటన అల్లూరు జిల్లా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతులు చేయిస్తున్నారు.ఈ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ మీటర్ షార్ట్ సర్క్యూట్ అయింది. వెంటనే వైర్లన్నీ కాలిపోయి ఆస్పత్రి వ్యాప్తంగా దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో రోగులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు. ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటికి పొగలు తగ్గిపోయాయి. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎలక్ట్రీషియన్‌కు గాయాలయ్యాయి. విశాఖ ఆస్పత్రికి తరలించారు.