డ్రగ్స్ కంటైనర్ వెనుక రహస్యమేంటో.. ఇలా ఎన్ని వచ్చాయో..!
విశాఖపట్నం పోర్ట్‌కు బ్రెజిల్ నుంచి చేరిన డ్రగ్ కంటైనర్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది....
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్ట్‌కు బ్రెజిల్ నుంచి చేరిన డ్రగ్ కంటైనర్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో ముంబై, గుజరాత్ లకు వచ్చిన డ్రగ్ కంటైనర్ విశాఖపట్నం రావడం అందరినీ పెద్ద షాక్‌కు గురిచేసింది. మార్చి 16న విశాఖ చేరుకున్న కంటైనర్‌ను మార్చి 19న అధికారులు తెరిచి కొన్నింటిని పరీక్షించగా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్దారించారు. అనంతరం మరింత లోతైన పరీక్షల కోసం నేషనల్ ఫోరెన్సిక్ లేబొరేటరీ నిపుణులను తీసుకొచ్చారు.
వేయి శాంపిల్స్ టెస్ట్‌కి..
సీబీఐ జడ్జి సమక్షంలో వెయ్యి బ్యాగ్‌లలోని శాంపిల్స్‌ను సేకరించి, డ్రగ్ డిటెక్షన్ టెస్టులను సీబీఐ అధికారులు నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు శాంపిల్స్ సేకరణ, పరీక్షల నిర్వహణ కొనసాగింది. అనంతరం కొన్ని నమూనాలను నార్కోటిక్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకు పంపారు. ఫలితాల కోసం వారం సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. సీబీఐ ప్రాథమిక పరీక్షల్లో ప్రమాదకర ఆరు రకాల నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్టుగా నిర్దారణ అయిందని తెలుస్తుంది. డ్రై-ఈస్ట్‌తో మిక్స్ చేసి సరఫరా చేసినట్టు సీబీఐ నిర్ధారించింది. ఈ పదార్థాన్ని సరఫరా చేసిన ఐసీసీ- బ్రెజిల్ కంపెనీతోనూ సీబీఐ సంప్రదింపులు చేస్తోంది. సంధ్యా ఆక్వా – ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య జరిగిన మెయిల్ సంభాషణలను అధికారులు పరిశీలిస్తున్నారు. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించి, నిర్దారణ తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నట్టు సమాచారం.
కంటైనర్‌ను తెచ్చిన నౌక ఏమైంది.?
బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి డ్రై-ఈస్ట్‌తో ఉన్న కంటైనర్ జనవరి 14న చైనాకు సంబంధించిన వ్యాపార నౌక బయల్దేరింది. వాస్తవానికి ఫిబ్రవరిలోనే విశాఖపట్నం చేరాల్సి ఉన్నా రెడ్‌సీలో జరుగుతున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 16న విశాఖకు చేరుకుంది. మధ్యలో ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ ఎంటరై ఆ ఓడను ట్రాక్ చేస్తూ వచ్చింది. సీబీఐ పూర్తిస్థాయిలో నౌక గురించి ఆరా తీసేసరికి ఆ నౌక విశాఖలో కంటైనర్‌ను దింపి తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు వెళ్లింది. అక్కడ కస్టమ్స్ అధికారుల సమన్వయంతో నౌక అధికారులను ప్రశ్నించగా బ్రెజిల్ నుంచి ఈస్ట్ ఉన్న కంటెయినర్‌ను విశాఖ పోర్టులో జేఎం భక్షికి చెందిన టెర్మినల్ బెర్త్‌లో దించినట్లు వెల్లడించారు. దీంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు నేరుగా మార్చి 18వ తేదీ విశాఖకు చేరుకుని తదుపరి విచారణ ప్రారంభించారు.
గతంలో ఏమైనా వచ్చాయా?
ఇదే తరహాలో గతంలో ఏమైనా కంటైనర్ లు విశాఖపట్నం పోర్టు కు వచ్చాయా? అన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. సంధ్య ఆక్వా దిగుమతులు అన్నింటి వివరాలు సేకరిస్తున్నారు. సంధ్య ఆక్వా వ్యాపార లావాదేవీలు చిట్టా తీస్తున్నారు.
ప్రెస్ మీట్ రద్దు
ఈ ఆరోపణల పై వివరణ ఇచ్చేందుకు సంధ్య ఆక్వా యాజమాన్యం శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని ఆఖరి నిమిషంలో రద్దు చేశారు. ప్రభుత్వ పెద్దల వత్తిడి తో ఏర్పాటు చేసిన దీనిని విచారణ కొనసాగుతున్న సమయంలో సమావేశం మంచిది కాదన్న కొందరి అభిప్రాయంతో ఏకీభవించి రద్దు చేసినట్లు తెలుస్తోంది.