ఏపీలో ఓటర్లకు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. అలా చేస్తే నేరుగా జైలుకే
ఏపీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు షాకిచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు షాకిచ్చింది. ఓ వ్యక్తి రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ఇవాళ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మొదటి సమావేశాన్ని విజయవాడ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల మార్పులు, చేర్పులలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై అందరితో సమన్వయ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అందులో పురుష ఓటర్లు 1.99 కోట్లు ఉండగా, మహిళా ఓటర్లు 2.07 కోట్లు ఉన్నారని పేర్కొన్నారు. ఎస్ఎస్ఆర్ విడుదలకు ముందు ఎక్కడైనా ఓటర్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.