టీడీపీలో కీలకం కానున్న ఆ 14 మంది.. చంద్రబాబు బయటకు వచ్చే వరకేనా?

గతంలో వైఎస్ జగన్​అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. నాడు ఆయన కుటుంబ సభ్యులే పార్టీకి దిక్కయ్యారు. విజయమ్మ, షర్మిల కాలికి బలపం కట్టుకొని తిరిగారు. పాదయాత్రలు చేశారు.

Update: 2023-09-25 03:30 GMT

ఏ రాజకీయ పార్టీకైనా అంతర్గత ప్రజాస్వామ్యం, అధికార వికేంద్రీకరణే పది కాలాలపాటు కొనసాగడానికి దోహదపడతాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉండడంతో పద్నాలుగు మంది నేతలతో యాక్షన్​ కమిటీని నియమించారు. ఇది కేవలం బాబు బయటకు వచ్చేంత వరకేనా.. లేక శాశ్వతంగా కొనసాగుతుందా అనే చర్చ తెలుగు తమ్ముళ్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో ఏదైనా ఓ నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకుంటే దాని గురించి ముందుగా లీకులిచ్చేవారు. పార్టీలో భిన్నాభిప్రాయాలను గుర్తించి తాను అనుకున్న పని నెరవేరేట్లు చేసుకునే వారు. ప్రస్తుతం టీడీపీలో అన్ని వర్గాల అభిప్రాయాలకు.. నిర్ణయాలకు పెద్ద పీట వేసినట్లయింది. ఇదే కమిటీని ఎన్నికలదాకా కొనసాగిస్తారా లేక బాబు జైలు నుంచి బయటకు వచ్చాక మడతపెట్టి పక్కన పడేస్తారా అనే ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

దిశ, ఏపీ బ్యూరో: గతంలో వైఎస్ జగన్​అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. నాడు ఆయన కుటుంబ సభ్యులే పార్టీకి దిక్కయ్యారు. విజయమ్మ, షర్మిల కాలికి బలపం కట్టుకొని తిరిగారు. పాదయాత్రలు చేశారు. పార్టీని అధికారానికి తీసుకొచ్చేందుకు తమ వంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీడీపీలో తొలుత నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పార్టీ పగ్గాలు చేపడతారనే ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. నారా లోకేశ్​కూడా అరెస్టయితే పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ ముందుకొచ్చింది. దీంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పార్టీకి తిరిగి ప్రాణం పోసింది. పద్నాలుగు మంది ముఖ్య నేతలతో యాక్షన్​కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అధికారాన్ని ఈ కమిటీకి కట్టబెట్టారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమంటూ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

కనుమరుగైన దూకుడు..

కొన్నేళ్ల నుంచి తెలుగు దేశం పార్టీ అంటే కేవలం కమ్మ సామాజిక వర్గం పెత్తనమనే పేరుంది. ఎన్టీఆర్​హయాంలో బీసీ వర్గానికి పెద్ద పీట వేశారు. చంద్రబాబు హయాం నుంచి పార్టీకి పూర్తి కాలం పనిచేసే నేతలు కనుమరుగవుతూ వచ్చారు. పార్టీ ఆర్థిక అవసరాల కోసం వ్యాపార వర్గాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. దీంతో పార్టీ జెండా మోసే వర్గాలు వెనకబడిపోయాయి. ఆధిపత్య కులాలు ముందుకు వచ్చి మిగతా వర్గాలను వెనక్కి నెట్టాయి. టీడీపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇదొకటి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన యువత మొత్తం సాఫ్ట్​వేర్​ఇంజినీర్లు, వైద్యులుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో పార్టీలో దూకుడును ప్రదర్శించే యువత క్రమేణా కనుమరుగైంది.

ఇలా చేస్తే పార్టీకి మహర్దశే..

ప్రస్తుతం చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలతో కూడిన యాక్షన్​కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ భవిష్యత్తును నిర్దేశించాల్సింది ఈ కమిటీనే. దీంతో పార్టీలో తిరిగి సామాజిక వర్గాల పునరేకీకరణ జరుగుతుందని ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన నేతలు భావిస్తున్నారు. పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు అధికార కేంద్రాలు ఏర్పడతాయి. టీడీపీని సొంత పార్టీగా భావించే అవకాశాలున్నాయి. అధికారానికి వచ్చినా ఇలాగే యాక్షన్​ కమిటీ తన ఉనికిని చాటుకుంటే టీడీపీకి మహర్దశ పట్టినట్లేనని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబు ఎన్నికలదాకా జైల్లో ఉన్నా పార్టీని విజయతీరానికి చేర్చగలమనే ధీమా కమిటీలో వ్యక్తమవుతోంది. ఇక్కడ నుంచి యాక్షన్​కమిటీ మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు కసరత్తు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News