‘జగన్ కొత్త నాటకం’.. భూమన వ్యాఖ్యలకు స్వామీజీల కౌంటర్

జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆలయంలో అడుగుపెట్టాలని ఒకపక్క హిందూ సంఘాలు, కూటమి పార్టీలు డిమాండ్ చేస్తుంటే.. తమ నాయకుడిని డిక్లరేషన్ అడగడం రాజకీయ కుట్రేనంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

Update: 2024-09-27 06:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆలయంలో అడుగుపెట్టాలని ఒకపక్క హిందూ సంఘాలు, కూటమి పార్టీలు డిమాండ్ చేస్తుంటే.. తమ నాయకుడిని డిక్లరేషన్ అడగడం రాజకీయ కుట్రేనంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఇదే విషయంపై మాట్లాడుతూ తమ నాయకుడు జగన్‌ని డిక్లరేషన్ అడగడం దారుణమని, ఇది ప్రభుత్వ పతనానికి నాంది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే భూమన వ్యాఖ్యలకు కొంతమంది స్వామీజీలు, స్వామీజీల సంఘాలు కూడా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నాయి. తిరుమలలో శ్రీవారిని జగన్ దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్లాలని ప్రయత్నిస్తే అలిపిరి వద్దే అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో ‘సేవ్ తిరుమల.. సేవ్ టీటీడీ’ సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ స్వామీజీలంతా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ.. గత 5 ఏళ్లలో జగన్ తిరుమల దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదని, తిరుమల పవిత్రతను ఆయన కాపాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం తిరుమలలో మరో డ్రామాకు ఆయన తెరతీసే అవకాశం ఉందని ఆరోపించారు. ఆయన స్వామివారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.


Similar News