శ్రీవారి బ్రేక్ దర్శనాలు అంతా ఓ రహస్యమే!

తిరుమ‌ల‌లో బ్రేక్ ద‌ర్శ‌నాలు అంతా ర‌హ‌స్యం.

Update: 2023-04-16 02:45 GMT

దిశ, తిరుపతి: తిరుమ‌ల‌లో బ్రేక్ ద‌ర్శ‌నాలు అంతా ర‌హ‌స్యం. బేతాళ ర‌హ‌స్యం గురించి క‌థ‌లున్నాయి. ఈ రీతిలోనే తిరుమ‌ల‌లో బ్రేక్‌, ప్రోటోకాల్ ద‌ర్శ‌నాల‌న్నీ ధ‌ర్మారెడ్డికి త‌ప్ప‌ మ‌రొక‌రికి తెలియ‌ద‌ని అంటుంటారు. ఒక వైపు త‌మ‌కు స‌రైన ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌లేద‌ని అధికార పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులే తిరుమ‌ల శ్రీ‌వారి సాక్షిగా ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక మ‌న‌సులోనే కుమిలిపోయే వారి సంఖ్య లెక్క‌లేనంత‌.

అయితే టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి వాద‌న మ‌రోలా వుంది. టీడీపీ హ‌యాంలో కంటే త‌మ పాల‌న‌లోనే ఎక్కువ మందికి బ్రేక్‌, ప్రొటోకాల్ ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తున్నామ‌ని గొప్ప‌గా చెబుతుంటారు. కాసేపు ఇది నిజ‌మే అనుకుందాం. రోజుకు 4 వేల నుంచి 5 వేల వ‌ర‌కూ బ్రేక్ ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తున్నారు. డిమాండ్‌ను బ‌ట్టి ఈ సంఖ్య ఒక్కో సారి మ‌రో 500 వ‌ర‌కూ పెంచుతూ వుంటారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది. వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి ధ‌ర్మారెడ్డికి ఎదుర‌వుతున్న కీల‌క ప్ర‌శ్న‌కు స‌మాధానం రావాల్సి వుంది. ఒక వైపు అధికార పార్టీతో పాటు ఇత‌ర నాయ‌కుల‌కు త‌గినన్ని బ్రేక్ ద‌ర్శ‌నాలు ఇవ్వ‌లేద‌నే విమ‌ర్శ వుంది.

మ‌రోవైపు ధ‌ర్మారెడ్డి మాత్రం గ‌తం కంటే ఎక్కువ ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తున్నామ‌ని చెబుతున్నారు. ఇంతకూ ఎవ‌రికి, ఎక్క‌డి వారికి ఎక్కువ బ్రేక్, ప్రొటోకాల్ ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తున్నారో బ‌హిరంగ ప‌ర‌చాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ధ‌ర్మారెడ్డి త‌న ఇష్ట‌మొచ్చిన‌ట్టు నార్త్ ఇండియ‌న్స్‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇదే వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం వారికి ద‌ర్శ‌నం పెడితే.. స‌ద‌రు ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రిని పిలిపించుకుని లేదా మెసేజ్ పంపుతూ హెచ్చ‌రిస్తున్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. అస‌లు ప్ర‌తిరోజూ ఎవ‌రెవ‌రికి ఎన్నెన్ని ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తున్నారో, పూర్తి వివ‌రాల‌తో టీటీడీ వెబ్‌సైట్‌లో పెడితే పార‌ద‌ర్శ‌క‌త పాటించిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు. త‌ద్వారా గ‌తంలో టీటీడీలో ఎవ‌రూ చేయ‌ని ఘ‌న‌త ధ‌ర్మారెడ్డికి ద‌క్కుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

టీటీడీలో అన్య‌మ‌త ప్ర‌చార‌మే అప‌చారం కాద‌ని, పారద‌ర్శ‌క‌త‌, అవినీతి కూడా అంత‌కు మించి ప్ర‌మాదం అని ధ‌ర్మారెడ్డి గ్ర‌హించాల‌ని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు హెచ్చ‌రిస్తున్నారు. బ్రేక్, ప్రొటోకాల్ ద‌ర్శ‌నాల్లోని మ‌త‌ల‌బు ఏంటో బ‌య‌ట పెట్టాల‌ని ధ‌ర్మారెడ్డిని అధికార పార్టీ నేత‌లు నిల‌దీస్తున్నారు. తిరుమల‌ను కేంద్ర‌పాలిత ప్రాంత‌మ‌నే రీతిలో చేసుకుని, ఇష్టానురీతిలో పాల‌న సాగిస్తున్నార‌న్న అపప్ర‌ద నుంచి ధ‌ర్మారెడ్డి బ‌య‌ట ప‌డాలంటే... పార‌ద‌ర్శ‌క‌త‌, ద‌ర్శ‌నాల విష‌యంలో నిష్పాక్షిక‌త పాటించ‌డం ఒక్క‌టే మార్గం. దేవుని ద‌ర్శ‌నాల విష‌యంలో అస‌లు ర‌హ‌స్యాన్ని పాటించాల్సిన అవ‌స‌రం ఏంట‌నే ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రిదీ. అస‌లే ధ‌ర్మారెడ్డి ఎవ‌రినీ లెక్క చేయ‌న‌ని చెబుతుంటారు. ద‌ర్శ‌నాల విష‌యంలో టీటీడీ తెరిచిన పుస్త‌క‌మ‌ని, రోజువారీ వివ‌రాల‌ను వెబ్‌సైట్‌లో పెడితే, అప్పుడు నిజంగానే ఆయ‌న పెద్ద తోపు అని భ‌క్తులు న‌మ్ముతారు. లేదంటే ఆయ‌న అధ‌ర్మారెడ్డిగా మిగిలిపోతారు.

Tags:    

Similar News