దిశ, నెల్లూరు సిటీ: ఎన్ని సమస్యలు వచ్చినా తనకు రాజకీయ బిక్ష పెట్టిన వైసీపీని వీడే ప్రసక్తి లేదని కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. నమ్మిన వారి కోసం ప్రాణాలైనా అర్పించే సిద్ధాంతాన్ని తమ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తమకు నేర్పారని ఆయన తెలిపారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో తాను పార్టీ విడుతానంటూ అబద్ధపురాతలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ జగనన్న సైనికుడు నేనని చెప్పారు. ఇలాంటి అసత్య ప్రచారాలు తనను ఎంతో బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాల్లో వచ్చినట్లే తమ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కూడా చిన్న సమస్య వచ్చిందని, దానిని పార్టీ పెద్దలు పరిష్కరించే పనిలో ఉన్నారన్నారు. చిన్న సమస్యకే ప్రసార మాధ్యమాల్లో చిలువలు పలువలు చేసి వార్తలు రాయడం భావ్యం కాదన్నారు. ఎన్ని అవరోధాలు వచ్చినా 2024లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంను చేసేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని సుకుమార్ రెడ్డి తెలిపారు.