ప్రత్యేక హోదానే అజెండా..! విభజన హామీల సాధన కోసం రేపు ఢిల్లీలో షర్మిల ఆందోళన

వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రత్యేక హోదా అజెండా కానుందా? నెరవేరని రాష్ట్ర విభజన హామీలు చర్చనీయాంశం కానున్నాయా అంటే.. రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇవే అంశాలపై శుక్రవారం హస్తినలో ఆందోళనకు పిలుపునిచ్చారు.

Update: 2024-02-01 02:08 GMT

వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రత్యేక హోదా అజెండా కానుందా? నెరవేరని రాష్ట్ర విభజన హామీలు చర్చనీయాంశం కానున్నాయా అంటే.. రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇవే అంశాలపై శుక్రవారం హస్తినలో ఆందోళనకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ సైతం ఢిల్లీలో మోడీ, అమిత్​ షాలను కలిసి హామీల గురించి ప్రస్తావించనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో విభజన హామీలపై బీజేపీ ఓ నిర్ణయం తీసుకుంటుందా? తర్వాత ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందా? ప్రజలు కాషాయ పార్టీని నమ్ముతారా? వీటిపైనే ప్రజల్లో జోరుగా చర్చలు కొసాగుతున్నాయి. బీజేపీ తగు నిర్ణయం తీసుకోకుంటే టీడీపీ సైతం కమలనాథులతో పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడే పరిస్థితులున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: పీసీసీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి వైఎస్​ షర్మిలా రెడ్డి దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఓవైపు వైఎస్సార్​కు నిజమైన వారసురాలిని తానేని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మరోవైపు రాష్ట్రాన్ని దగా చేసిన బీజేపీకి వైసీపీ, టీడీపీ బానిసలుగా మారాయని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని దునుమాడుతున్నారు. అందులో భాగంగానే షర్మిల ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చారు. సీఎం జగన్​ హస్తిన పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఆయన కూడా మోడీ, అమిత్​ షాలను కలిసి విభజన హామీలపై దృష్టి సారించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి పరిస్థితులు వేరు..

అయోధ్యలో బాలరాముని ప్రతిక్ష అనంతరం రాష్ట్రంలో పొత్తులపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీ నేతలతో అధిష్టానం చర్చించింది. ఎక్కువ మంది టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. కేవలం టీడీపీ, జనసేనతో పొత్తుతోనే బీజేపీ బోణీ కొట్టలేదు. 2014 ఎన్నికల ముందు మోడీ ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, ఇతర విభజన హామీలు నెరవేరుస్తామని హామీనిచ్చారు. దాంతో ఆ ఎన్నికల్లో మూడు పార్టీల కలయిక ద్వారా కొన్ని సీట్లయినా సాధించుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీ ముద్ర వేసుకుంది. దీన్ని తొలగించుకోకుండా టీడీపీ–జనసేన కూటమితో కలిసినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

బీజేపీతో టీడీపీ చేయి కలిపితే..

ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనైనా ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించి స్పష్టతనిస్తే కొంతవరకు ప్రజలు విశ్వసించే అవకాశాలున్నాయి. టీడీపీ సైతం పొత్తు పెట్టుకోవడానికి ఓ ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఇవేం చేయకుండా పొత్తంటే టీడీపీ వెనుకాడే పరిస్థితులున్నాయి. బీజేపీ వ్యతిరేక సెగ తమకు తగులుతుందని తమ్ముళ్లు మథనపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ చావో రేవో అన్నట్లు తలపడనున్నాయి. అందువల్ల బీజేపీతో కలవాలా లేదా అనే మీమాంసతో టీడీపీ ఊగిసిలాడుతోంది. బీజేపీతో కలవడం వల్ల ముస్లిం మైనార్టీ, ఎస్సీ ఎస్టీ ఓట్లకు గండిపడుతుందని టీడీపీ ఆలోచిస్తోంది. మొత్తంమీద షర్మిల ఎక్కుపెట్టిన అంశాలు రాష్ట్ర రాజకీయ సమీకరణలనే మార్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Similar News