ఏపీలోని ఎన్నికలపై సంచలన సర్వే: ఏ పార్టీ ఎన్నిసీట్లు గెలుస్తుందో చెప్పేసిన ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సంస్థ సర్వే
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేలు అనేవి హల్‌చల్ చేస్తుంటాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేలు అనేవి హల్‌చల్ చేస్తుంటాయి. ఇప్పటికే ఏపీలో తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నారు. పార్టీల పరంగా సర్వే నిర్వహణ జరుగుతుంటే న్యూ సంస్థలు సైతం ఈ సర్వేలను నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయి మీడియా సంస్థలు ఏపీలో సర్వేలు చేస్తూ నివేదికలు బాంబు బ్లాస్ట్ అయ్యే నివేదికలను ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా మరికొన్ని నెలల వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికలు జరనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య అప్పుడే యుద్ధవాతావరణం నెలకొంంది. ఇలాంటి తరుణంలో ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సంస్థలు ఏపీలో పార్లమెంట్ ఎన్నికలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీకి గ్రాఫ్ తగ్గిందని.. టీడీపీ గ్రాఫ్ పుంజుకుందని స్పష్టం చేసింది. ఇకపోతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేవలం 2శాతం మాత్రమే ఓట్లను సాధిస్తాయని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే వెల్లడించింది. అంటే ఒక్క స్థానంలో కూడా ఇరు పార్టీలు గెలవలేవని పేర్కొంది.
టీడీపీకి 7 సీట్లు ప్లస్
2019 ఎన్నికల్లో ఏపీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్లే. 25 స్థానాలకు గాను 22 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో వైసీపీ వచ్చే ఎన్నికల్లో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. ఇందుకు సబంధించి సీఎం వైఎస్ జగన్ ఐప్యాక్ సర్వేతోపాటు స్పెషల్ సర్వేలు కూడా చేయిస్తున్నారు. సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను గుర్తించి వారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం సర్వేలో సీఎం వైఎస్ జగన్ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అందరికీ టికెట్ ఇవ్వలేనని.. టికెట్ దక్కలేని వారు కూడా తమ వారే అని వారికి కూడా రాబోయే రోజుల్లో న్యాయం చేస్తామని ప్రకటించారు. వైసీపీ ఇలా గెలుపుపై ధీమాగా ఉన్న తరుణంలో ఇండియా టీవీ- సీఎన్ ఎక్స్ సంస్థ చేపట్టిన సర్వేలో వైసీపీకి గూబ గుయ్ మనిపోయే ఫలితాలు వచ్చాయి. వైసీపీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో కంటే ఈసారి ఓట్ల శాతం తగ్గుతుందని ప్రకటించింది. ఈసారి వైసీపీకి 46 శాతం ఓట్లు, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. అలాగే బీజేపీకి, కాంగ్రెస్ పార్టీల ప్రభావం ఏమాత్రం ఉండదని కేవలం 2 శాతం మాత్రమే సాధిస్తారని తెలిపింది. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సంస్థ సర్వే ప్రకారం టీడీపీ 10 చోట్ల గెలుస్తుందని తేటతెల్లమైంది. గత పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ 3 స్థానాల్లో గెలిచింది. తాజా సర్వే ప్రకారం వైసీపీ 7 పార్లమెంట్ స్థానాలను కోల్పోతుందని తెలిపింది. మరోవైపు టీడీపీ మరో 7 స్థానాలను తన ఖాతాలో వేసుకోనుందని తెలిపింది.
పడిపోయిన వైసీపీ గ్రాఫ్
గత ఎన్నికల కంటే జగన్‌కు ప్రజల్లో ఆదరణ కొంత మేర తగ్గిందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వేలో తేలింది తెలిపింది. వైసీపీ అవినీతి అక్రమాలు, అక్రమ అరెస్టులు వైసీపీ ఇమేజ్‌ను పూర్తిగా దెబ్బ తీశాయని తెలుస్తోంది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల వరుస అరెస్ట్‌లు, భూ కబ్జాలు వంటి విషయాలు వైసీపీ గ్రాఫ్ తగ్గడానికి కారణమని సర్వేలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే తెలిపింది.